Russia Ukraine War : ఖేర్సన్‌లో రష్యా దళాలు తోకముడవడం యుద్ధం అంతానికి ఆరంభం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. శత్రు దళాలను తరిమికొట్టేందుకు దేశ సైనికులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన ఉక్రెయిన్ దక్షిణప్రాంత కీలక నగరం ఖేర్సన్‌లో జెలెన్‌స్కీ సోమవారం పర్యటించారు. అక్కడ సెంట్రల్ స్క్వేర్‌లో ఉక్రెయిన్ దళాలతో ముచ్చటించారు. అయితే జెలెన్‌స్కీ పర్యటనపై స్పందించేందుకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తిరస్కరించారు.
పైగా ఆ ప్రాంతం రష్యా సమాఖ్యకు చెందిన భూభాగమని స్పష్టం చేశారు. రష్యా తిరోగమనం తరువాత ఆ ప్రాంతంలో వారు పాల్పడ్డ హింస, ఇతర దురాగతాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు వెల్లడించాయి. రష్యా దురాక్రమణ నుంచి స్వేచ్ఛావాయులు పొంది సంబరాలు చేసుకుంటున్న ఖేర్సన్ వాసులు విద్యుత్ సౌకర్యం, నీరు, ఆహారం, మందుల కొరతను ఎదుర్కొంటున్నారు. కాగా విశాల ఖేర్సన్ ప్రాంతంలో 70 శాతం రష్యా ఆధీనంలోనే ఉంది.
రష్యా మద్దతుదారులపై అమెరికా కొరడా
రష్యాకు సైనిక పరంగా మద్దతుపలుకుతున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం అమెరికా ప్రకటించింది. ఫ్రెంచ్ స్థిరాస్తి సంస్థలు, స్విట్జర్లాండ్‌కు చెందిన పలువురు వ్యక్తులు, తైవాన్‌కు చెందిన మైక్రోఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కొనుగోలు సంస్థ.. అగ్రరాజ్యం తాజా ఆర్థిక, దౌత్య ఆంక్షలకు గురయ్యాయి. ఈ సంస్థలు, వ్యక్తులకు రష్యా సైన్యానికి ఆర్థికంగా చేయూతనందించడం లేదా సరఫరాలను అందిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధిపతిపై ఈయూ ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధంలో వినియోగించేందుకు రష్యాకు చౌకైన డ్రోన్లు(యూఏవీ), క్షిపణులను ఎగుమతి చేసిందన్న కారణంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హొస్సైన్ సలామిపై ఐరోపా సమాజం (ఈయూ) సోమవారం ఆంక్షలు విధించింది. ఇరాన్ మానవ రహిత వైమానిక వాహనాల అభివృద్ధి కార్యక్రమం, వాటిని విదేశాలకు తరలించడం వంటి అంశాలపై హొస్సైన్‌కు నియంత్రణ ఉంటుందన్న నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది. రివల్యూషనరీ గార్డ్ ఏరోస్పేస్ ఫోర్స్, కమాండింగ్ జనరల్‌పైనా, క్వాడ్స్ ఏవియేషన్ ఇండస్ట్రీస్‌పైనా ఆంక్షలు పెట్టింది. షహెద్-136, మొహజెర్-6 రకానికి చెందిన డ్రోన్లను రష్యాకు అందించారని, ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాటిని వినియోగించిందని ఈయూ ఆరోపించింది.