Russia Ukraine War Update : రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో మరో గ్రామం తిరిగి తమ చేతుల్లోకి వచ్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్ గ్రామమైన స్టోరోజోవ్‌పై తమ దేశ జెండా రెపరెపలాడినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాలియార్ వెల్లడించారు. అంతకుముందు తూర్పు దొనెత్క్స్ ప్రాంతంలో వెలికా నోవోసిల్కే పట్టణానికి దక్షిణంగా కలిసి ఉన్న మరో మూడు చిన్న గ్రామాలు రష్యా నుంచి విముక్తి పొందాయని చెప్పారు. రష్యాకు చెందిన వాగ్నర్ కిరాయి ముఠా ఇటీవల ఆక్రమించిన బ్లహుడాని గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ఆపరేషన్‌లో 68వ సెపరేట్ హంటింగ్ బ్రిగేడ్.. గ్రామం నుంచి శత్రుసేనలను తరిమికొట్టిందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న మూడు గ్రామాల నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లాయో లేదో మాస్కో ధ్రువీకరించలేదు. కొంతమంది రష్యా సైనిక బ్లాగర్లు ఆ ప్రాంతాల్లో నియంత్రణ కోల్పోయినట్లు అంగీకరించారు. మరోవైపు దక్షిణ , తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలలో వెయ్యి కిలోమీటర్ల మేర తమ సైనికులు ఉన్నారని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ భారీస్థాయి ఎదురుదాడులను తిప్పికొడుతున్నామని పేర్కొంది. దొనెత్స్క్, జపోరిజియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులు విఫలమయ్యాయని నల్ల సముద్రంలో చేసిన బోట్ల దాడినీ సమర్థంగా తిప్పికొట్టామని రష్యా మంత్రిత్వశాఖ తెలిపింది. గ్యాస్ పైప్‌లైన్లను పేల్చివేసేందుకు పంపిన అన్ని స్పీడ్ బోట్లనూ పేల్చివేశామని చెప్పింది.