Russia Ukraine War: ఉక్రెయిన్‌పై పోరాటాన్ని 'ప్రత్యేక సైనిక చర్య'గా చెబుతూ వస్తున్న రష్యా.. త్వరలోనే దీనిని అధికారికంగా యుద్ధంగా ప్రకటించబోతోందా? 1945 మే 9న నాజీలను ఓడించినందుకు గుర్తుగా ఏటా అదేరోజు జరిపే విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి ఈ ప్రకటన చేయబోతోందా?.. రిజర్వ్ బలగాలను పూర్తిస్థాయిలో బరిలో దించడానికి వీలు కల్పించే ఇలాంటి నిర్ణయాన్ని రష్యా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను గుప్పిట పట్టాలన్న ప్రయత్నంతో ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన దాడి ఏకధాటిగా కొనసాగుతున్నా, ఇప్పటివరకు ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల రష్యా కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఇప్పటికే చాలామంది సైనికుల్ని కోల్పోవాల్సి రావడం వల్ల రిజర్వు బలగాలను రంగంలోకి దించాలంటే యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించడం అనివార్యమని తెలుస్తోంది. యుద్ధానికి అధికారిక ముద్ర వేయాలన్నది దానిలో భాగమే.
సరిగ్గా 9వ తేదీనే ఏదైనా కీలక ప్రకటన చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై భారీ విజయం సాధించినట్లు గానీ, కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు గానీ ప్రకటన వెలువడవచ్చని ఆ అంచనాలు చెబుతున్నాయి. నాజీలపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రజామద్దతును కూడగట్టాలనేది పుతిన్ యోచనగా చెబుతున్నారు. తమపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతీకారం తీర్చుకునే చర్యల ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు.