Russia President Elections : రష్యా అధ్యక్ష ఎన్నికలను 2024 మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు తీర్మానించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు అధ్యక్షుడు 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనప్రాయమేనని స్పష్టం అవుతోంది. అయితే ఇలా రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచారు పుతిన్. తద్వారా 2036 వరకు ఆ పదవిలో కొనసాగేందుకు ఇప్పటికే మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలో గడిచిన 24 ఏళ్లుగా ఆయన పాలనలో నెలకొన్న కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం.
1999, డిసెంబర్ 31 :
దేశ అధ్యక్ష బాధ్యతల నుంచి బోరిస్ యెల్ట్‌సిన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పట్లో ప్రధానిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
2000, మే 7 :
ఆ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 53శాతం ఓట్లతో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పట్లో అధ్యక్షుడి కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే.
2002, అక్టోబర్ 23 :
చెచెన్యాకు చెందిన మిలిటెంట్లు రాజధాని మాస్కోలోని ఓ థియేటర్‌లో 850 మంది ప్రజలను బందీలుగా చేశారు. ఈ క్రమంలో మూడు రోజుల తర్వాత రంగంలోకి దిగిన పుతిన్ సేనలు థియేటర్లోకి ఓ గ్యాస్‌ను పంపించాయి. దాంతో ఈ ఘటనకు ముగింపు పలికినా 130 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారు. ఇది అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పుతిన్ సమర్థించుకున్నారు. వందల మందికి పైగా పౌరులను రక్షించగలిగినట్లు చెప్పారు.
2003, అక్టోబర్ 25 :
రష్యాలో అత్యంత సంపన్నుడైన చమురు వ్యాపార దిగ్గజం మిఖైల్ ఖొడొర్కొవొస్కిని పుతిన్‌కు ప్రత్యర్థిగా భావించేవారు. అదే సమయంలో పన్ను ఎగవేత, మోసం కింద అరెస్టైన ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఆయన చమురు సంస్థలో అధిక భాగం ప్రభుత్వ సంస్థ స్వాధీనం చేసుకుంది. మిగతా దానిని నేలకూల్చారు.
2004, మార్చి 14 :
వ్లాదిమిర్ పుతిన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2004, సెప్టెంబర్ 1 :
ఈరోజున బెస్లాన్ నగరంలోని ఓ పాఠశాలను స్వాధీనం చేసుకున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. విద్యార్థులపై పేలుళ్లు, దాడులకు దిగారు. ఇందులో మొత్తం 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి స్థానిక నేతల అసమర్థత, బలహీనతే కారణమని అప్పట్లో ఆరోపించారు పుతిన్. ఈ కారణంతోనే ఆయా ప్రాంతాల్లో ఎన్నికకు బదులుగా గవర్నర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
2007, ఫిబ్రవరి 10 :
అమెరికాతో రష్య సత్సంబంధాలు బలపడేలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే మ్యూనిక్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లో పుతిన్ చేసిన ప్రసంగం ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీసింది.
2008, మే 8 :
రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు పుతిన్‌కు అవకాశం లేదు. దాంతో దిమిత్రి మెద్విదేవ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుతిన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
2008, ఆగస్టు 8-12 :జార్జియా దేశంతో స్వల్పకాలిక యుద్ధానికి దిగింది రష్యా. దీంతో వేర్పాటువాద అబ్‌ఖజియా, దక్షిణ ఒసేటియా ప్రాంతాలపై పట్టు సాధించింది.