తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2022, 5:08 PM IST

ETV Bharat / international

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భీకర దాడి.. 60కిపైగా క్షిపణుల ప్రయోగం.. ఆ ప్రాంతాల్లో కరెంట్​ కట్​

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్‌, ఖార్కివ్‌ సహా నాలుగు నగరాలపై 60కిపైగా క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణంలో క్షిపణి దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఖార్కివ్‌ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. అనేక చోట్ల రైళ్లను స్టీమ్‌ ఇంజిన్లతో నడపాల్సిన పరిస్థితి నెలకొంది.

russia Attacks On Ukraine
ఉక్రెయిన్‌

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్‌పై రష్యా శుక్రవారం 60కిపైగా క్షిపణులను ప్రయోగించింది. నాలుగు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరాలైన కీవ్‌, ఖార్కివ్‌లో విద్యుత్‌, నీటి సరఫరాలకు అంతరాయం కలిగింది. కీవ్‌లో పలు చోట్ల క్షిపణులు పడినట్లు అధికార యంత్రాంగం సామాజిక మాధ్యమాల్లో తెలిపింది.

ఉక్రెయిన్‌ వ్యాప్తంగా వైమానిక దాడుల అలారంలు మోగాయి. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ఎన్నింటిని ఉక్రెయిన్‌ సైన్యం అడ్డుకోగలిగిందో తెలియలేదు. నల్ల సముద్రం నుంచి రష్యా ఈ క్రూయిజ్‌ క్షిపణులు ప్రయోగించనట్లు తెలుస్తోంది. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను తప్పుదారి పట్టించేందుకు బాంబర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రష్యా ఉపయోగించింది.

అధునాతన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందిస్తే ఆ వ్యవస్థతో పాటు దానితో పాటు వచ్చే సిబ్బందిని తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే అమెరికాను రష్యా హెచ్చరించింది. ఐతే శీతాకాలంలో ఉక్రెయిన్‌ వాసులను అతి శీతల వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఇంధన వ్యవస్థను రష్యా లక్ష్యాలుగా చేసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

మధ్య ఉక్రెయిన్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణం క్రైవీ రిహ్‌పై రష్యా చేసిన క్షిపణి దాడిలో ఒక నివాస భవనం ప్రవేశం దెబ్బతింది. ఇక్కడ ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారికి ఆస్పత్రికి తరలించారు. జాపోరిజ్జియా నగరంపై రష్యా 18 క్షిపణులు ప్రయోగించింది. విద్యుత్‌ సరఫరా లేక ఖార్కివ్‌ నగరం అల్లాడుతోందని ఖార్కివ్‌ ప్రాంతీయ గవర్నర్‌ వెల్లడించారు. ఖార్కివ్‌లో కీలక మౌలిక సదుపాయాలపై మూడు క్షిపణి దాడులు జరిగినట్లు తెలిపారు. షెల్టర్లలో ప్రజలు తలదాచుకోవాలని ఉక్రెయిన్‌ వాసులకు అధికారులు సూచించారు. ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిని రైళ్లను స్టీమ్‌ ఇంజిన్‌తో నడుపుతున్నారు. ఈ నెల 5 తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా భారీగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details