తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్బులున్నా లోన్ కట్టలేకపోయిన రష్యా​.. 104 ఏళ్ల తర్వాత తొలిసారి! - రష్యా రుణ చెల్లింపు వందేళ్ల తర్వాత

ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే రష్యా.. 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో విఫలమైంది. రష్యా దగ్గర రుణ చెల్లింపులకు తగినన్ని నిల్వలు ఉన్నా.. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ రుణదాతలకు 100 మిలియన్ల డాలర్లు చెల్లించలేకపోయింది.

russia-in-historic-foreign-debt-default
russia-in-historic-foreign-debt-default

By

Published : Jun 27, 2022, 5:20 PM IST

విదేశీ రుణాల చెల్లింపులు చేయలేని స్థితికి రష్యా చేరింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత మాస్కో ఇలాంటి పరిస్థితికి చేరడం గమనార్హం. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. రష్యా వద్ద 100 మిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపులు చేసేందుకు నిధులు ఉన్నాయి. కానీ, ఆంక్షల కారణంగా అంతర్జాతీయ రుణదాతలకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పటికే రుణచెల్లింపులు ఆపకూడదని భావించిన క్రెమ్లిన్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బ.

తాజాగా ఏం జరిగిందంటే..
రష్యా మే 27వ తేదీన రుణ చెల్లింపులకు సంబంధించి 100 మిలియన్‌ డాలర్ల సొమ్మును యూరోక్లియర్‌ బ్యాంక్‌కు పంపించింది. ఈ బ్యాంకు నుంచి ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ, ఆ సొమ్ము యూరోక్లియర్‌ వద్దే నిలిచిపోయింది. గడువు తేదీ దాటి 30 రోజులు గడిచినా రుణదాతలకు సొమ్ము చేరలేదు. ఈ సొమ్మును నిలిపివేసినట్లు యూరోక్లియర్‌ వెల్లడించలేదు. కేవలం ఆంక్షలకు కట్టుబడి ఉన్నామని మాత్రమే పేర్కొంది.

వాస్తవానికి రష్యా యూరోక్లియర్‌కు సొమ్ము చెల్లించడానికి రెండురోజుల ముందు అమెరికా ట్రెజరీ శాఖ తీసుకొన్న నిర్ణయం ఈ పరిస్థితికి కారణమైంది. ఇన్వెస్టర్లకు రష్యా నుంచి వడ్డీ చెల్లింపు సొమ్మును తీసుకొనేందుకు కూడా మినహాయింపులు ఇవ్వకూడదని నాడు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది. అమెరికా ట్రెజరీ నిర్ణయ పరిణామాలను క్రెమ్లిన్‌ అంచనావేసింది. దీంతో ఇన్వెస్టర్లకు రూబుళ్ల రూపంలో రష్యన్‌ బ్యాంక్‌ ద్వారా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. డాలర్ల రూపంలో ఉన్న కాంట్రాక్టులకు కూడా ఇదే విధానం వర్తించనుంది. రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్‌ సిల్యానోవ్‌ మాట్లాడుతూ ‘పెట్టుబడి దారులకు సొమ్ము చేరడంలేదు’ అని అంగీకరించారు. విదేశీ చెల్లింపు వ్యవస్థలు సహకరించకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు సొమ్ము స్వీకరించకుండా నిషేధం విధించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన విశ్లేషించారు. వాస్తవానికి ఇది ఏమీ రుణ ఎగవేత కాదని ఆయన పేర్కొన్నారు.

రష్యా చివరి సారిగా 1918లో విదేశీ అప్పులు చెల్లించడంలో విఫలమైంది. అప్పట్లో రష్యాలో బోల్షివిక్‌ విప్లవం జరుగుతోంది. ఆ సమయంలో ఐరోపా దేశాలు ఇచ్చిన రుణాలను చెల్లించేందుకు కమ్యూనిస్టు నాయకుడు లెనిన్‌ నిరాకరించారు. ఇక 1998లో రష్యా దేశీయ రుణ చెల్లింపుల్లో విఫలమైంది. బోరిస్‌ ఎల్సిన్‌ పాలన సమయంలో తలెత్తిన రూబుల్‌ సంక్షోభం కారణంగా దేశీయ బాండ్లకు చెల్లింపులు నిలిపివేసి విదేశీ అప్పులు చెల్లించారు.

ఇవీ చదవండి:ఫ్రెండ్​ కార్​లో షికారుకు వెళ్లడమే అతడి పొరపాటు.. దారుణంగా కాల్చి...

బుల్​ఫైట్​లో కుప్పకూలిన స్టాండ్​.. నలుగురు మృతి.. వందల మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details