దొనెట్స్క్‌లో ఉక్రెయిన్ క్షిపణి దాడి ఘటనపై రష్యా మరోసారి స్పందించింది. నూతన సంవత్సరం వేళ.. సైనికులు నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్లను వినియోగించడం వల్లే ఈ దాడి జరిగిందని ఆరోపించింది. ఈ ఘటనలో మొత్తం 89 మంది సైనికులను కోల్పోయినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ వీడియో ప్రకటన విడుదల చేసింది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇటీవల భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. జనవరి 1న తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో రష్యా సైనికులు బస చేసిన శిబిరంపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో వందల మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ చెప్పగా.. 63 మంది సైనికులను కోల్పోయినట్లు రష్యా తొలుత ప్రకటించింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో మాస్కో మిలిటరీ కమాండర్లపై సోషల్‌మీడియా వేదికగా ప్రజాగ్రహం మొదలైంది. ఈ క్రమంలో రక్షణ శాఖ స్పందించింది.
"మకివ్కాలో రష్యా సైనికులు బస చేసిన వొకేషనల్ కాలేజీపై ఉక్రెయిన్ నాలుగు క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం. అయితే ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ల వినియోగమే. శత్రువుల ఆయుధాల పరిధిలో ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ మా సైనికులు చాలా మంది మొబైళ్లను ఆన్ చేసి ఉపయోగించారు. దీంతో శత్రువులు సిగ్నళ్లను ట్రాక్ చేసి మా సైనికుల కచ్చితమైన లొకేషన్‌ను గుర్తించి దాడి చేశారు. ఈ ఘటనలో 89 మంది సైనికులు మరణించారు" అని రష్యా లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్ర్యుకోవ్ ఆ వీడియోలో వెల్లడించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని, ఈ ఘటనలో బాధ్యులకు శిక్ష తప్పదని తెలిపారు. కాగా.. మృతుల్లో ఎక్కువ మంది రిజర్విస్టులే. ఇటీవలే వీరంతా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నట్లు సమాచారం.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది క్షణాల తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు హతమయ్యారని, మరో 300 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే రష్యా మాత్రం 89 మంది మరణించినట్లు అంగీకరించింది. కాగా.. ఈ దాడికి ఉక్రెయిన్.. అమెరికా తయారీ 'హిమార్స్' రాకెట్లను ఉపయోగించింది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేరడంలో హిమార్స్ రాకెట్లకు తిరుగులేదు. ఇదిలా ఉండగా.. దొనెట్స్క్ ఘటన నేపథ్యంలో కీవ్‌పై రష్యా ప్రతీకార దాడులు చేపడుతోంది.