Russia Biden sanctions: ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం అందించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా కీలక అడుగులు వేస్తోంది. అమెరికా వాసులపై నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా 963 అమెరికన్లపై ప్రయాణ నిషేధం విధించినట్లు పుతిన్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. గతంలోనే అధ్యక్షుడు బైడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, సీఐఏ చీఫ్ విలియమ్ బర్న్స్‌పై ప్రయాణ నిషేధం విధించినట్లు తెలిపింది. ఆ జాబితాలో మరికొందరి పేర్లు చేర్చడంతో మొత్తం సంఖ్య 963కు చేరినట్లు తెలిపింది.
అయితే, ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు లేదని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతల్లో మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోపై మాత్రమే రష్యా నిషేధం విధించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ప్రయాణ నిషేధాలు పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం లాంఛనప్రాయ ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.
రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా దన్నుగా నిలుస్తోంది. ఆయుధాలు అందిస్తూ, ఆర్థికసాయం చేస్తోంది. తాజాగా మరోసారి ఆర్థికసాయానికి ముందుకొచ్చింది. బైడెన్ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లును 86-11 ఓట్లతో పాస్ చేసింది. ఈ బిల్లు ప్రకారం సైనిక, మానవీయ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందనుంది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు నిర్ణయించుకొన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సెనెట్ ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ కింద అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించే అవకాశం లభించింది.
దౌత్యమే పరిష్కారం...
మరోవైపు, ఉక్రెయిన్ సంక్షోభానికి కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. చర్చల విషయంలో ఉక్రెయిన్-రష్యా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో ఓ టీవీ ఛానెల్‌లో జెలెన్‌స్కీ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు కొనసాగి యుద్ధం రక్తమయమవుతోందన్న జెలెన్‌స్కీ... చివరకు దౌత్యం ద్వారానే దీనికి తెరపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య నిర్ణయాత్మక చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే అవి మధ్యవర్తుల ద్వారానా లేదా అధ్యక్ష స్థాయిలోనా అన్న విషయంపై స్పష్టత లేదని అన్నారు. ఏది ఏమైనా చర్చల ఫలితాలు ఉక్రెయిన్‌కు న్యాయం చేకూర్చేలా ఉండాలని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. మేరియుపోల్ అజోవ్‌స్తల్ ఉక్కు కర్మాగారంలో లొంగిపోయిన ఉక్రెయిన్ సిబ్బందిని రష్యా చంపకూడదన్న ముందస్తు షరతుతోనే చర్చలకు ముందుకొస్తామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: