Russia Airstrikes Syria : సిరియాపై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు చిన్నారుల సహా 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సిరియాలో ఇద్లిబ్ ప్రాంతంలోని తిరుగుబాటు వర్గాలపై అధ్యక్షుడు బషర్ అసాద్‌కు మద్దతిస్తున్న రష్యా ఆదివారం ఉదయం వైమానిక దాడులు జరిపింది. తుర్కియే సరిహద్దుల్లోని జిస్ర్ అల్-షుగూర్ నగరంలోని కూరగాయల మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో సాధారణ పౌరులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సిరియాలోని తిరుగుబాటుదారుల నియంత్రణలో ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై రష్యా యుద్ధ విమానాలు వైమానిక దాడులు జరిపాయి. ముస్లిం మెజారిటీ దేశమైన సిరియాలో ఈద్ అల్-అధాకు ముందు వస్తున్న ఈ ప్రాంతంలో వైమానిక దాడులు జరగడం ఇది రెండో సారి అని అధికారులు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఫిరంగి కాల్పులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.
'ప్రిగోజిన్ హీరో.. సెల్ఫీలు'
Wagner Group Russia : మరోవైపు..ఒక రోజంతా రష్యాను కలవరపెట్టేలా చేసిన వాగ్నర్ గ్రూపుఆ తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోయినా ఆ పరిణామం మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వానికి సవాల్‌గానే భావిస్తున్నారు. క్రెమ్లిన్‌లో, రక్షణశాఖలో లోపాలను ఈ పరిణామం చాటిందని అమెరికా కేంద్రంగా పనిచేసే ఓ 'యుద్ధ అధ్యయన సంస్థ' తెలిపింది. బహుశా ఉక్రెయిన్‌పై పోరులో భారీగా సైనికుల్ని కోల్పోవాల్సి రావడం వల్లే ఈ తాజా తిరుగుబాటుపై గట్టిగా స్పందించడానికి రష్యా ప్రభుత్వం తటపటాయించిందని వెల్లడించింది.
Prigozhin Mutiny : బెలారస్ రాయబారంతో కుదిరిన ఒప్పందం మేరకు వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్.. రష్యా సైనిక కేంద్రమైన రొస్తోవ్-ఆన్-డాన్‌ను వీడి బెలారస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగుబాటు చేసినందుకు ఆయనపై కేసుల్ని రష్యా కొట్టివేయాలి. ఒప్పందంలో ఈ రెండూ ఉన్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వాగ్నర్ గ్రూప్ దళాలు సరిహద్దుల్లోని వాటి స్థావరాలకు వెళ్లాయని తెలిపారు. ప్రిగోజిన్ రోడ్డు మార్గాన పయనమయ్యారనీ, ఆ సమయంలో వాగ్నర్ దళాలు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నాయని వార్తలు వచ్చాయి. ప్రిగోజిన్‌ను వెన్నుపోటుదారుడిగా పుతిన్ అభివర్ణిస్తే.. రొస్తోవ్ వాసులు మాత్రం ఆయనను ఓ హీరోగా చూసి.. సెల్ఫీలు దిగడానికి, కరచాలనాలకు దారిపొడవునా ఎగబడటం గమనార్హం. ఇది ప్రజల్లో ప్రిగోజిన్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుతోందనీ, పుతిన్ సర్కారుకు మింగుడుపడని పరిణామమని అంటున్నారు.
వాగ్నర్ గ్రూపుతోపాటు ప్రిగోజిన్‌పై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు రష్యా అధికారులు అంగీకరించారు. ప్రస్తుతానికి కథ సుఖాంతమైనా ప్రైవేటు సైన్యం నుంచి ఇలాంటి ముప్పును పుతిన్ గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిణామాలను యావత్ ప్రపంచం ఆసక్తితో గమనిస్తున్న వేళ పుతిన్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Wagner Group Rebellion : వాగ్నర్ కిరాయి మూకలు తిరుగుబాటుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాయని అమెరికా నిఘా వర్గాలు కొద్ది రోజుల ముందే పసిగట్టాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధానికి, పెంటగాన్‌కు నివేదించాయి. పుతిన్‌కు కూడా ఈ తిరుగుబాటుపై ఒకరోజు ముందే తెలుసనే ప్రచారం జరుగుతోంది. రష్యాలో ఉద్రిక్తతలు జరగనున్నాయని 24 గంటల ముందే నిఘా సంస్థలు శ్వేతసౌధం, పెంటగాన్‌లకు నివేదిక సమర్పించాయి.
రష్యాలో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించి ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాధినేతలతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలని ఈ దేశాధినేతలు నిర్ణయించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేసినా అది ఇబ్బందనే ఉద్దేశంతో ఏమీ బయటకు వెల్లడించలేదు. తమ పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలని పాశ్చాత్య దేశాలు చూస్తే సహించేది లేదని రష్యా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.