తెలంగాణ

telangana

ETV Bharat / international

బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం.. ఉలిక్కిపడ్డ NRIలు.. రైస్ స్టోర్ల ముందు బారులు - అమెరికా బియ్యం ఎన్నారై

India Rice Export Ban : బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం ఎన్నారైలను కలవరపాటుకు గురిచేసింది. అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం రైస్ స్టోర్ల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని భారతీయ స్టోర్స్ వద్ద బియ్యం కోసం చిన్నపాటి యుద్ధాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల నో-స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

rice export ban
rice export ban

By

Published : Jul 22, 2023, 4:59 PM IST

Rice Export Ban : దేశీయంగా బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గురువారం నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌ దృష్ట్యా రిటైల్‌ ధరలను అదుపులో ఉంచటానికి, దేశీయంగా సరఫరాను పెంచటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహారశాఖ ప్రకటన విడుదల చేసిన వెంటనే.. ఎన్ఆర్ఐలు ఉలిక్కిపడ్డారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు బియ్యం కోసం రైస్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. ఇదే అదనుగా బియ్యం ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. కొన్ని స్టోర్స్ ముందు ధరలు పెరిగినట్లు బోర్డులు పెట్టి మరీ అమ్మేస్తున్నారు.

నో-స్టాక్ బోర్డులు..
అమెరికాలో బియ్యం కోసం NRIలు క్యూ కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొన్నిచోట్ల బియ్యం బస్తాల కోసం గొడవలు పడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. కొన్ని స్టోర్స్ ముందు.. నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయంటే బియ్యం కోసం ప్రవాస భారతీయులు ఏ స్థాయిలో పోటీపడ్డారో అర్థమవుతోంది.

ట్వీట్లు, మీమ్స్..
బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందో తెలియదనే భయంతో అవసరానికి మించి కొందరు బియ్యం కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. డల్లాస్‌లోని కొన్ని స్టోర్స్ దగ్గర కనిపిస్తున్న భారీ క్యూలైన్లు NRIల కంగారుకు అద్దంపట్టాయి. ఎన్నారైల పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలైతే ఇల్లు కొంటే 15 రైస్ బ్యాగ్స్ ఉచితమంటూ ఆఫర్లు ఇస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యంపై మాత్రమే నిషేధం విధించగా.. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతుల విధానంలో ఎలాంటి మార్పు లేదు. బియ్యం ఎగుమతుల్లో వీటిదే సింహభాగం కాగా.. బాస్మతీయేతర తెల్లబియ్యం వాటా 25 శాతమే. థాయ్‌లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌, శ్రీలంక, అమెరికాకు ఇవి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. 2021-22లో 26.2 లక్షల డాలర్ల విలువైన బాస్మతీయేతర బియ్యం ఎగుమతి కాగా, 2022-23లో వాటి ఎగుమతుల విలువ 42 లక్షల డాలర్లకు పెరిగింది. దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర తెల్ల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో 11.5 శాతం మేర ధర పెరగ్గా.. ఈ నెల రోజుల్లో 3 శాతం మేర పెరిగినట్లు కేంద్ర ఆహారశాఖ తెలిపింది.

ధరలను తగ్గించటానికి, మార్కెట్లో వాటి నిల్వలను పెంచటానికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఎగుమతులపై 20 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం వాటి ఎగుమతులు 33.66 లక్షల టన్నులు కాగా.. ఈ ఏడాది అవి 42.12 లక్షల టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక- రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయని ఆహారశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతులపై పూర్తి నిషేధం విధించినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details