Rahul Gandhi vs Narendra Modi : అగ్రరాజ్యం అమెరికా వేదికగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi Bjp RSS : కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో రాహుల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. 'అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే అన్నీ వివరించగల సమర్థులు. ప్రధాని నరేంద్ర మోదీ అందుకు గొప్ప ఉదాహరణ. ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు' అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.
"బీజేపీ ప్రజలను భయపెడుతోంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రించింది. ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని అర్థమైంది. అందుకే భారత్ జోడో యాత్రను చేపట్టా. నా యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు. మా యాత్రకు మరింత ఆదరణ దక్కింది. ఆ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత