Quad summit 2022: ఐరోపాలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.. స్వేచ్ఛాయిత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్వాడ్ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, స్వేచ్ఛాయిత, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ను ప్రోత్సహిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్ కోసం నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళ్తోందని తెలిపారు. క్వాడ్ పరిధి విస్తృతమైందని, మరింత ప్రభావవంతంగా మారిందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల సరఫరా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం సహా పలు అంశాలలో సమన్వయాన్ని కొనసాగించామని మోదీ గుర్తుచేశారు.
" ఇంత తక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి.. ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. ఇవాళ క్వాడ్ పరిధి విస్తరించింది. క్వాడ్ స్వరూపం ప్రభావవంతంగా మారింది. మన మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పసిఫిక్ నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ ఒక నిర్మాణాత్మక ఎజెండాతో పనిచేస్తోంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
రష్యాపై బైడెన్ విమర్శలు: రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఒక సంస్కృతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ప్రస్తుత వివాదం ఐరోపా అంశం మాత్రమే కాదని.. అంతర్జాతీయ అంశమని అభిప్రాయపడ్డారు. రష్యా యుద్ధాన్ని కొనసాగించినంత కాలం అమెరికా తమ భాగస్వామ్య పక్షాల తరుఫున పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయిత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
" ఇది కేవలం ఐరోపాకు చెందిన అంశం మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంశం. అధ్యక్షుడు పుతిన్ ఒక సంస్కృతిని నిర్మూలించేందుకు యత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలనే కాదు.. పాఠశాలలు, చర్చిలు, జాతీయ మ్యూజియంతో పాటు సంస్కృతిని నిర్మూలించేందుకు యత్నిస్తున్నారు. ఉక్రెయిన్ ఆహారధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవటం వలన ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. రష్యా యుద్ధం కొనసాగించినంత వరకూ అమెరికా తన భాగస్వామ్య పక్షాల తరుఫున పనిచేస్తుంది."