Qatar Navy Case :గూడఛార ఆరోపణలతో భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఒకప్పుడు భారత ప్రధాన యుద్ధనౌకల్లో పనిచేసిన అధికారి సహా 8 మందికి ఖతార్ న్యాయస్థానం మరణ దండన విధించింది. వారి బెయిల్ పిటిషన్లను ఇప్పటికే అనేక సార్లు ఖతార్ అధికారులు తిరస్కరించి నిర్బంధాన్ని పొడిగించారు. తాజాగా ఖతార్ కోర్టు 8 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Indian Navy Officers In Qatar Jail :మరోవైపు, భారత మాజీ నావికాదళ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధించడంపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి తీర్పు వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. న్యాయపరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్లు వివరించింది. వారి కుటుంబ సభ్యులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. మాజీ నేవీ అధికారులకు అన్నిరకాలుగా దౌత్యపరమైన, న్యాయపరమైన సాయం కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని వివరించింది. ఈ కేసుకు అధిక ప్రాధాన్యం దృష్ట్యా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని.. ఖతార్ అధికారుల వద్దకు ఈ విషయాన్ని తీసుకుని వెళతామని పేర్కొంది. మాజీ నావికాదళ అధికారులను ఖతార్ అరెస్ట్ చేయడంలో పాకిస్థాన్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.