తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​తో యుద్ధం, పుతిన్​కే రష్యన్ల ఫుల్ సపోర్ట్- ఐదోసారీ ఆయనదే పీఠం! - Putin Russia Polls

Putin Russia Polls : వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కే మరోసారి పట్టం కట్టాలని రష్యన్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి, పుతిన్‌కు రష్యన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోందని ఆ దేశంలో నిర్వహించిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకదశలో పుతిన్‌కు 80 శాతానికిపైగా రష్యన్ల మద్దతు లభించడం గమనార్హం.

Putin Russia Polls
Putin Russia Polls

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:20 PM IST

Putin Russia Polls : 2024లో జరగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి, అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్లు భారీగా మద్దతు పలకడమే అందుకు కారణం. రష్యాను 24 ఏళ్లగా పుతిన్‌ పరిపాలిస్తూ వస్తున్నారు. ఐదోసారి కూడా రష్యా అధ్యక్ష పదవిని పుతిన్‌ చేపట్టడం ఖాయమని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి.

సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను 73 శాతం రష్యన్లు సమర్థిస్తున్నట్లు తేలింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పుడు ఈ సంఖ్య 68 శాతమే ఉండేది. పుతిన్‌కు రష్యన్లలో ఉండే ఆదరణ కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఒకదశలో ఇది 80 శాతానికి చేరింది. ఇటీవల రష్యా పబ్లిక్‌ ఒపీనియన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో పుతిన్‌కు 78 శాతం రష్యన్ల మద్దతు ఉన్నట్లు తేలింది.

ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై రష్యా సర్కారు చెబుతున్న కారణాలను మెజార్టీ రష్యన్లు విశ్వసిస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యన్ల హక్కుల పరిరక్షణ, నాటో విస్తరణ ముప్పును యుద్ధానికి కారణాలుగా రష్యా చెబుతూ వస్తోంది. సైనికుల మనో స్థైర్యాన్ని పెంచేందుకు వారి జీతాలను కూడా రష్యన్‌ ప్రభుత్వం భారీగా పెంచింది. సైనికుల నెలవారీ జీతాలు జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు అధికంగా ఉన్నాయి.

'పుతిన్​ ప్రత్యర్థి మిస్సింగ్​'
Navalny Russia Missing : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవానీ జైలు నుంచి అదృశ్యమయ్యారు. తాము ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని, ఆయన జాడపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని నవానీ న్యాయవాదులు తెలిపారు. కాగా, సోమవారం నవానీ వర్చువల్‌గా కోర్టులో హాజరుకావాల్సి ఉంది కానీ జైలులో విద్యుత్ సమస్య వల్ల ఆయన్ను హాజరుపర్చలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, నవానీ మిస్సింగ్‌పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాలోని దౌత్యకార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

24 ఏళ్లుగా అధికారంలో 'ఒకే ఒక్కడు'- ఐదోసారీ పాలించేందుకు రెడీ!

గయానా X వెనెజులా- చమురు నిక్షేపాల కోసం మరో యుద్ధం!

ABOUT THE AUTHOR

...view details