Britian Indian Autos: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహన జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం 'మహీంద్రా ఎలక్ట్రిక్' ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.
పార్కులు, నడక మార్గాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్‌కు ఈ ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించనున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. 'ఈ ఆటోల వద్ద పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. పోలీసు సంబంధిత సేవలు లభిస్తాయి. నేరాల నివారణకు సలహాలనూ అందించొచ్చు' అని వివరించారు. 'సేఫ్ స్ట్రీట్స్ ప్రోగ్రామ్'లో భాగంగా ఈ ఆటోలను ప్రవేశపెడుతున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి, మహిళల భద్రత విషయంలో ఇది తోడ్పడుతుంది.