తెలంగాణ

telangana

ETV Bharat / international

షిప్​లో భారీ అగ్ని ప్రమాదం.. 31 మంది దుర్మరణం.. మరో ఏడుగురు.. - థాయ్​లాండ్​ వార్తలు

250 మంది ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చెలరేగడం వల్ల 31 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్​లో జరిగింది. మరోవైపు, థాయ్​లాండ్​లోని బ్యాంకాంక్ సమీపంలో కార్చిచ్చు చెలరేగింది. అడవిలో మంటల కారణంగా వ్యాపించిన దట్టమైన పొగకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Philippines ship fire accident several died and many injured
Philippines ship fire accident several died and many injured

By

Published : Mar 30, 2023, 3:41 PM IST

Updated : Mar 30, 2023, 7:11 PM IST

ఫిలిప్పీన్స్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 250 మంది ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. అగ్నిప్రమాదంలో సుమారు 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్​లో జరిగింది.

"జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్​లోని జోలీ పట్టణానికి ఓడ వెళ్తుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. మంటల కారణంగా భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు.. అగ్నికీలల్లో చిక్కుకుని మరికొందరు మరణించారు. దగ్ధమైన ఓడను బాసిలన్ తీరానికి అధికారులు చేర్చారు. ఓడ క్యాబిన్​లోనే 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం" అని ప్రావిన్స్​ గవర్నర్​ జిమ్​ హతమన్​ తెలిపారు.

సహాయక చర్యల దృశ్యాలు
సహాయక చర్యల దృశ్యాలు
దగ్ధమవుతున్న ఓడ

యూనివర్సిటీ బస్​- పాసింజర్​ వెహికల్ ఢీ.. 14 మంది దుర్మరణం
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ బస్సు.. ప్రయాణికుల వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో సహా 14 మంది మృతి చెందారు. 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో 30 మంది ఉన్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని నైరోబీ నుంచి నకూరు పట్టణం వైపు వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి కాలువలోకి బోల్తా పడిందని వెల్లడించారు.

అడవిలో చెలరేగిన కార్చిచ్చు.. వాహనాలు ఎక్కడికక్కడే!
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు ఈశాన్యంగా 114 కిలోమీటర్ల దూరంలోని నఖోన్ నాయోక్ ప్రావిన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. అడవిలో మంటల కారణంగా వ్యాపించిన దట్టమైన పొగకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఖావో చాప్లు పర్వతంలోని ఎత్తైన భాగంలో మంటలు చెలరేగడం వల్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు సాధ్యపడలేదని అధికారులు తెలిపారు. దీంతో పక్కనే ఉన్న ఖావో లామ్ పర్వతానికి కూడా మంటలు వ్యాపించినట్టు తెలిపారు. మే టాంగ్, చియాంగ్ మాయిలోని శివారు ప్రాంతాల్లో మంటలను ఆర్పేందుకు దాదాపు 18 వేల లీటర్ల నీటిని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

134 మంది ప్రయాణిస్తున్న ఓడలో మంటలు..
కొన్నినెలల క్రితం ఫిలిప్పీన్స్​లో 134 మంది ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. సుమారు 120 ప్రయాణికులను రక్షించినట్లు తీరప్రాంత రక్షణ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న నలుగురు గల్లంతయ్యారు. అనేక మంది ప్రయాణికులు, సిబ్బంది నీటిలో దూకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఈశాన్య ఫిలిప్పీన్స్ ప్రావిన్స్​లో జరిగినట్లు చెప్పారు. ఇంజిన్​లో తలెత్తిన లోపమే ప్రమాదానికి కారణమైనట్లు తెలిపారు.

ఫిలిప్పీన్స్​లోని సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అకస్మత్తుగా తుపానులు సంభవించడం, సరైన భద్రతా నిబంధనలు అమలు పరచకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. 1987 డిసెంబరులో ఓ భారీ నౌక.. ట్యాంకర్​ను ఢీకొట్టిన ఘటనలో 4,300 మందికి పైగా మరణించారు.

Last Updated : Mar 30, 2023, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details