జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్‌తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటోందని మండిపడింది.
Bilawal Bhutto On India: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్‌తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాయని అన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీశాయని అభిప్రాయపడ్డారు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం, జెనీవా కన్వెన్షన్‌ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఆర్థిక కార్యకలాపాలు, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కారం అవుతాయని తాము అర్థం చేసుకున్నామన్నారు. కానీ ఇలాంటి దూకుడు ప్రవర్తన కారణంగా చర్చలు జరగడానికి అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.
తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన భుట్టో గురువారం మీడియాతో మాట్లాడారు. గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. అది భారత ప్రభుత్వ అంతర్గత నిర్ణయమని.. కానీ ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంస్థలను నిరుత్సాపరుస్తాయన్నారు. ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోలేని వారి అవసరాలను తీర్చేందుకు మన మందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం: జమ్ముకశ్మీర్‌పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలవాల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. పాకిస్థాన్ ప్రతి వేదికను భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ భద్రతా మండలి నిర్వహించిన 'అంతర్జాతీయ శాంతి, ఆహార భద్రత' అంశంపై చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్ రాజేశ్ పరిహార్ స్పందించారు.