బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం
09:38 August 16
బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం
పాకిస్థాన్లో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్లో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
"ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ పరస్పరం ఢీకొన్నాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు వాహనాల్ని దహించివేశాయి. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే వారు ఎవరో నిర్ధరించాల్సి ఉంది. ఆ తర్వాతే కుటుంబసభ్యులకు మృతదేహాలు అందజేస్తాం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు ప్రయాణికుల్ని ముల్తాన్లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది" అని పాకిస్థాన్ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై అనేక గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పారు.
ముల్తాన్ రోడ్డు ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. చనిపోయిన వారిని గుర్తించి, మృతదేహాలు వారి కుటుంబసభ్యులకు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పాకిస్థాన్ పంజాబ్లో శనివారం ఇదే తరహాలో ఓ లారీ, బస్సు ఢీకొనగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.