Pakistan political crisis: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై ఆగ్రహించిన విపక్షాలు.. సొంతంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. ఆ తీర్మానాన్ని తమకు తాముగా ఆమోదించాయి. మరోవైపు- జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధానమంత్రి నియామకం దిశగా దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ చర్యలకు పూనుకున్నారు. ఆ పదవికి పేర్లను సూచించాల్సిందిగా ఇమ్రాన్, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌లకు లేఖ రాశారు. స్పందించిన ఇమ్రాన్.. పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ప్రతిపాదించారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సోమవారం వాదనలు ఆలకించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
197 ఓట్లతో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం...:ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి ఆదివారం అనూహ్యంగా తిరస్కరించిన అనంతరం జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖాసిమ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు బయటకు వెళ్లబోమంటూ విపక్ష సభ్యులు సభలోనే బైఠాయించారు. రాత్రి బాగా పొద్దుపోయాక పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకుడు, మాజీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ అధ్యక్షతన ప్రతిపక్ష నేతలు సభను నిర్వహించారు. ఇమ్రాన్‌పై విపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన 22 మంది తిరుగుబాటు సభ్యులు, పీటీఐకి ఇన్నాళ్లూ మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీల నాయకులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. 197 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందినట్లు అయాజ్ సాదిక్ ప్రకటించారు.