పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ అరెస్టు తీరుపై ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అరెస్టు చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు ఇమ్రాన్‌ను గంటలో తమ ఎదుట హాజరుపరచాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB)ను ఆదేశించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్‌ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా న్యాయస్థానం ప్రాంగణం నుంచి ఎలా అరెస్టు చేస్తారని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అటా బండియాల్, జస్టిస్ ముహమ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఒక వ్యక్తి కోర్టు ఆవరణలోకి ప్రవేశించడం అంటే కోర్టుకు లొంగిపోవడమేనని.. లొంగిపోయిన తర్వాత అతణ్ని ఎలా అరెస్టు చేస్తారని సూటి ప్రశ్నను సంధించింది. అయితే కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు పరిసరాల నుంచి ఎవరినీ అరెస్టు చేయరాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీనిని కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తున్నామని పాక్ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యాలు చేసింది.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అపహరించి కర్రలతో కొట్టారని, కస్టడీలో తీవ్రంగా హింసించారని సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. కరుడుగట్టిన నేరస్థుల్ని కూడా ఇంతలా హింసించరని ఆయన వాపోయారు. నిరసనకారుల చేసిన హింసను ఖండించాలని ప్రధాన న్యాయమూర్తి అడిగినప్పుడు... తాను కస్టడీలో ఉన్నానని చెప్పారు. రక్తపాత నిరసనలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని చెప్పారు. తాను హింసకు దూరంగా ఉంటానని... తానెప్పుడూ హింసకు మద్దతు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన మద్దతుదారులను కోరారు.