Pakistan petrol price: ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలకు ఇప్పుడు ఇంధనం మరింత భారంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.179.85, డీజిల్ లీటరు రూ.174.15, కిరోసిన్ రూ.155.95, లైట్ డీజిల్ రూ.148.41కు చేరాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాక్ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ దేశ విత్తమంత్రి మిఫాత్ ఇస్మైల్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
"ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు దేశానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలపై ఈ భారం వేయకతప్పట్లేదు." అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ హయాంలో.. పెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ అమలులోకి వచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.