Oldest Skydiver Dead : 104 ఏళ్ల వయసులో స్కైడైవ్ చేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన వృద్ధురాలు చికాగోకు చెందిన డొరొథీ హోఫ్‌నర్ కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆమె మరణించినట్లు హోఫ్‌నర్ స్నేహితుడు కానెంట్ తెలిపారు. ఆమె మరణంపై స్కైడైవ్ చికాగో, అమెరికా పారాషూట్ అసోషియేషన్లు సంతాపం తెలిపాయి. ఆమె స్మారక సభను నవంబర్లో నిర్వహిస్తామని వెల్లడించాయి. డొరొథీ హోఫ్‌నర్ ఈ రికార్డు సృష్టించిన కొద్ది రోజులకే మరణించారు.
Worlds Oldest Parachute Jump : ఇటీవలె అక్టోబర్ 1న 13,500 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి స్కైడైవ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు డొరొథీ హోఫ్‌నర్. ప్రపంచంలోనే ఇంతటి సాహసం చేసిన అత్యధిక వయస్కురాలిగా నిలిచారు ఈ బామ్మ. ఇల్లినాయిస్ ఒట్టావాలోని స్కైడైవ్ చికాగో అనే స్కైడైవింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహసాన్ని పూర్తి చేశారు డొరొథీ. ఈ క్రమంలో సుమారు ఏడు నిమిషాల పాటు గాల్లో తేలియాడుతూ నగర సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఆపై ఇన్‌స్ట్రక్టర్ ప్యారాషూట్ ఓపెన్ చేయడం వల్ల సురక్షితంగా భూమి పైకి దిగారు. దీనిపై హోఫ్నర్ను అడగగా.. వయసు సంఖ్య మాత్రమే.. ఇలాంటి సాహసాలు చేయడానికి వయసుతో పనిలేదని చెప్పుకొచ్చారు బామ్మ.
అయితే, అంతకుముందు ఈ రికార్డు 103 ఏళ్ల స్వీడిష్ బామ్మ లిన్నియా లార్సన్ పేరిట ఉంది. కానీ తాజాగా డొరొథీ ఈ రికార్డును బద్దలుకొట్టి చరిత్రను తిరగరాశారు. కాగా, హోఫ్‌నర్.. రికార్డులు, ప్రచారం కోసం స్కైడైవ్ చేయలేదని.. కేవలం ఇష్టంతోనే అలా చేశారని చెప్పారు ఆమె స్నేహితుడు కానెంట్. తన వందేళ్ల వయసులోనే స్కైడైవింగ్ చేయాలని అనుకున్నారు డొరొథీ. కానీ ఆ సమయంలో కుదరకపోవడం వల్ల.. నాలుగేళ్లు తర్వాత తాజాగా 13,500 ఎత్తు నుంచి దూకారు బామ్మ.