Modi on Pannun Murder News :ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిక్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో జరిగిన కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ఉన్నారనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి అలాంటి సమాచారం ఏదైనా తమకు అందిస్తే కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి కొన్ని ఘటనలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు మోదీ.
"భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చట్టానికి లోబడి పాలన చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరం. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వారు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలను భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం భావ్యం కాదు. ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా బలమైన సంబంధాలు ఉన్నాయి"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి