Modi Biden Bilateral Talks :జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తొలిసారి భారత్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో.. దిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. బైడెన్‌న తన నివాసానికి స్వాగతం పలకడం ఎంతో ఆనందదాయకమన్న ప్రధాని మోదీ.. అత్యంత ఫలప్రదంగా భేటీ జరిగిందని తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, ప్రజా సంబంధాలను మున్ముందుకు తీసుకువెళ్లేలా.. అనేక అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. దాదాపు 50 నిమిషాలసేపు సాగిన భేటీ అనంతరం నేతల సంయుక్త ప్రకటన విడుదలైంది.
Modi Biden Bilateral Meeting :జీ20కి భారత్ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం, 6G, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్జాతీయ బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు... వీరి మధ్య చర్చకు వచ్చాయి. తమ దేశానికి చెందిన జనరల్ ఆటోమిక్స్ నుంచి MQ-9B రకం డ్రోన్లు 31 కొనుగోలు చేసేందుకు.. భారత రక్షణ శాఖ లేఖ అందజేయడాన్ని బైడెన్ స్వాగతించారు. సాంకేతికత బదలాయింపు ద్వారా G.E.F-414 జెట్ ఇంజిన్లను GE ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఉత్పత్తి చేయాలన్న వాణిజ్య ఒప్పందాన్న వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. G-20 కూటమి ముఖ్యమైన ఫలితాలను ఇవ్వడంలో భారత్ సారథ్యం దోహదపడుతోందని బైడెన్ ప్రశంసించారు.
G20 Summit 2023 Modi and Biden :ఉమ్మడి లక్ష్యాల పురోగతిక శిఖరాగ్ర సదస్సు ఫలితాలు ఆలంబనగా నిలుస్తాయని మోదీ, బైడెన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత, దాపరిక రహిత కార్యకలాపాల్లో క్వాడ్ కూటమికి ఉండే ప్రాధాన్యాన్ని వారు గుర్తుచేశారు. 2024లో భారత్ ఆతిథ్యం ఇవ్వబోయే క్వాడ్ సదస్సుకు బైడెన్‌ను మోదీ ఆహ్వానించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, బహుళత్వం, ప్రజలందరికీ సమానావకాశాలు వంటివి రెండు దేశాల సంబంధాలను విజయవంతం చేస్తాయని నేతలిద్దరూ పేర్కొన్నారు. 2028-29లో ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇస్తామని బైడెన్ ప్రకటించారు.
భారత్‌కు బైడెన్ అభినందనలు..
ఇటీవల చంద్రయాన్-3, ఆదిత్య-L1 సోలార్ మిషన్‌లు విజయవంతమైనందుకు మోదీని అభినందించారు బైడెన్. ఇస్రో, నాసా మధ్య భాగస్వామ్యం బలోపేతమవుతుందని నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. గ్రహ శకలాల నుంచి భూగోళాన్ని, అంతరిక్ష ఆస్తులను పరిరక్షించుకోవడంలో సమన్వయాన్ని పెంచుకోనున్నట్లు సంయుక్త ప్రకటన తెలిపింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆవిష్కరణల్లో సహకారానికి ఒప్పందం కుదిరింది. శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు.. ఉన్నత విద్యాసంస్థల మధ్య ఒప్పందాలు కుదరడాన్ని నేతలు ఆహ్వానించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా బైడెన్‌కు మోదీ విందు ఇచ్చారు.