తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆమెకు ఐదో కాన్పులోనూ కవలలే.. మొత్తం 10 మంది.. ఇల్లొదిలి భర్త పరార్! - how many sets of twins in one family

'ఒక్కరు లేదా ఇద్దరు'... పిల్లల విషయంలో ప్రస్తుతం దాదాపు అందరి ఆలోచన ఇదే. కానీ.. ఆమె మాత్రం ఐదు సార్లు గర్భం దాల్చింది. ప్రతిసారీ కవలలకే జన్మనిచ్చింది. 10 మంది పిల్లల్ని పెంచడం నా వల్ల కాదంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు భర్త. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది భార్య.

uganda baby twins
ఆమెకు ఐదో కాన్పులోనూ కవలలే.. మొత్తం 10 మంది.. ఇల్లొదిలి భర్త పరార్!

By

Published : Jul 27, 2022, 3:18 PM IST

బిడ్డ పుడితే ఎవరికైనా ఆనందమే. అదే కవలలు అయితే.. డబుల్ సంతోషం. కానీ.. అలా ఐదు సార్లు కవలలే పుడితే? మొత్తం 10 మంది సంతానాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత భుజాలపై పడితే? ఉగాండాలో ఇదే జరిగింది. ఇంతమందిని పోషించడం నా వల్ల కాదంటూ.. భార్యను, పిల్లల్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు భర్త.

వివరాల్లోకి వెళ్తే.. నలోంగో గ్లోరియా నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. ఉపాధి కోసం రాజధాని కంపాలాకు వచ్చింది. అక్కడే కొన్నేళ్ల క్రితం స్సలోంగో పరిచయం అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గ్లోరియా గర్భం దాల్చింది. కవలలకు జన్మనిచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు కవలల్ని ప్రసవించింది గ్లోరియా.

సాధారణంగా మహిళలు ఐవీఎఫ్​ చికిత్స తీసుకుంటే కవలలకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. గ్లోరియా విషయంలోనూ అలాంటిదేమీ లేదు. సహజసిద్ధంగానే ఆమె ఐదు సార్లు కవలల్నే ప్రసవించింది. అయితే.. ఆమె భర్త స్సలోంగోకు మాత్రం ఇది నచ్చలేదు. 9వ, 10వ బిడ్డలు పుట్టగానే.. గ్లోరియాకు తన మనసులో మాట తెగేసి చెప్పేశాడు అతడు. పుట్టింటికి వెళ్లిపోమని అన్నాడు. అయితే.. అందరినీ విడిచి వచ్చేసిన గ్లోరియాకు ఏం చేయాలో పాలుపోలేదు. భవిష్యత్ సవాళ్లను ఊహించుకుంటూ ఇంట్లో అలానే మౌనంగా ఉండిపోయింది.

ఓ రోజు పనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి స్సలోంగో ఇంటి దగ్గర లేడు. లగేజీ సర్దుకుని ఎక్కడికో వెళ్లిపోయాడని ఆలస్యంగా అర్థమైంది. భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. అప్పటి నుంచి అతడి దగ్గరి నుంచి ఒక్క ఫోన్​ కాల్ అయినా రాలేదు. సంతానంలో మొదటి ఇద్దరు పెద్దవారై, ఇటీవలే తమ దారి తాము చూసుకుని వెళ్లిపోయారు. మరొకరు మరణించారు. మిగిలిన ఏడుగురి బాధ్యత ఇప్పుడు గ్లోరియాపైనే పడింది.
"ఇంత మంది పిల్లలకు జన్మనిచ్చినందుకు నాకు బాధ లేదు. తండ్రికి వీరంటే ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ వీరిని వదిలేయలేను. ఎన్ని సవాళ్లు ఎదురైనా.. నా బిడ్డల్ని విడిచి పెట్టను. దేవుడే అన్నీ చుసుకుంటాడని నమ్ముతున్నా" అని చెప్పింది నలోంగో గ్లోరియా.

ABOUT THE AUTHOR

...view details