ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పటికే పిండి సంక్షోభంతో సతమతమవుతున్న పాక్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి దేశంలోనే అనేక ప్రధాన నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్మిషన్లలో లోపాల వల్ల ఈ అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. కరాచి, లాహోర్ లాంటి ప్రధాన నగరాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియా తెలిపింది.
అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాన నగరాలకు పవర్ కట్
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. సోమవారం ఉదయం నుంచి ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్మిషన్లలో వచ్చిన లోపం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.
"పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎక్కడ అంతరాయం కలిగిందో తెలుసుకుంటున్నాము. ఈ సమస్యను పరిష్కరిస్తామని" విద్యుత్ అధికారులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. గుడ్డు నుంచి క్వెట్టాకు రెండు ట్రాన్స్మిషన్ లైన్లలో అంతరాయం ఏర్పడటం వల్ల విద్యుత్ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. క్వెట్టా సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా లేదని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది.
దేశంలో ఫారెన్ నిల్వలు పడిపోవడం వల్ల పాక్ పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. పాకిస్థాన్ ఈ నెలలో కొత్త ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో పాకిస్తాన్ విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని వలన దేశంలోని పెద్ద ప్రాంతాలు, ప్రావిన్షియల్ రాజధానులు కరాచీ, లాహోర్‌లో 12 గంటలకు పైగా విద్యుత్ అంతరాయం కలిగింది.