రష్యా, పశ్చిమ దేశాలు పరస్పర అణు హెచ్చరికలు చేసుకుంటున్న వేళ.. మాస్కో వ్యూహాత్మక అణు బలగాలు విన్యాసాలు నిర్వహించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఈ విన్యాసాలను పర్యవేక్షించారు. బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులను ఈ విన్యాసాల్లో భాగంగా రష్యా ప్రయోగించింది. ఈ విన్యాసాల్లో భాగంగా అన్ని లక్ష్యాలను చేరుకున్నట్లు రష్యా ఓ ప్రకటన చేసింది. రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ రష్యా చేసిన ఈ అణు విన్యాసాలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. రష్యాపై అణుదాడి జరిగితే అందుకు ప్రతీకారంగా ప్రత్యర్థులపై భారీగా అణ్వస్త్రాలు ప్రయోగించేందుకే ఈ విన్యాసాలను చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు.
మరోవైపు అణు విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యా తమకు ముందే సమాచారం ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. డర్టీ బాంబును తమపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్ యత్నిస్తున్నట్లు రష్యా ఆరోపించిన కొన్ని రోజులకే ఈ అణు విన్యాసాలను ఆ దేశం చేపట్టడం గమనార్హం. ఐతే రష్యా ఆరోపణలను ఇప్పటికే ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 9 నెలలు పూర్తికాగా చాలాసార్లు ఇరువర్గాలు అణు హెచ్చరికలు చేసుకున్నాయి. రష్యా అణుబాంబు ప్రయోగిస్తే అది ఆ దేశం చేసిన తీవ్ర తప్పిదమే అవుతుందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.