Kabul bomb blast: అఫ్గానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. రాజధాని కాబుల్‌లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అనేక మంది గాయపడ్డారు.
కాబుల్‌లోని స్థానిక ఖలీఫా సాహిబ్ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రంజాన్ ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొలుత 10 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 50కి పైగా పెరిగినట్లు మసీదు నేతలు వెల్లడించారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. ఘటన తర్వాత ఎటు చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలే కన్పిస్తున్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.