తెలంగాణ

telangana

ETV Bharat / international

కవలలే కానీ చాలా తేడా..! ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నిస్ రికార్డులో చోటు

సాధారణంగా కవలలు అంటే రూపంతో పాటు అన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటారు. కానీ జపాన్​కు చెందిన ఇద్దరు కవలలు సోమరీమణులను చూసిన వారు మాత్రం వీరు ట్విన్స్ అంటే నమ్మరు. వీరికి ఉన్న ఈ ప్రత్యేకతతో ఏకంగా గిన్నిస్​ రికార్డ్​నే సొంతం చేసుకున్నారు. అయితే ఈ ట్విన్​ సిస్టర్స్​ గురించి తెలుసుకుందామా మరి..!

japan twin sisters
japan twin sisters

By

Published : Feb 27, 2023, 11:41 AM IST

జపాన్​కు చెందిన ఇద్దరు ట్విన్ సిస్టర్స్​ సరికొత్త రికార్డ్​ను నెలకొల్పారు. ప్రపంచంలో ఏ కవలలకు సాధ్యం కాని విధంగా అరుదైన​ రికార్డ్​ను సొంతం చేసుకున్నారు. ఈ కవల సోదరీమణుల ప్రత్యేకత ఏంటంటే.. వీరి ఎత్తుల మధ్య తేడానే ఈ అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ హైట్​ డిఫరెన్స్​తోనే వీరు ఏకంగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ను సాధించారు. వీరే జపాన్​కు చెందిన యోషి, మిచీ కికుచి అనే ట్విన్​ సిస్టర్స్​.

జపాన్​లోని ఓకాయామాలో 1989 అక్టోబర్ 15న ఓ తల్లి కడుపున యోషి, మిచీ కికుచి జన్మించారు. వీరిద్దరూ కవల సోదరీమణులు. వీరి పుట్టుక ఒకే తల్లి గర్భంలో రెండు వేర్వేరు అండాల ఫలదీకరణ వల్ల జరిగింది. అయితే మిచీ కికుచికి పుట్టుకతో కాంజినైటల్ స్పైనల్ ఎపిఫిజియల్ డైస్ప్లాసియా అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎముకల్లో పెరుగుదల లేదు. ఫలితంగా ఆమె ఎత్తు పెరగలేదు. మిచీతో పాటు జన్మించిన యోషి మాత్రం వయసుతో పాటు ఎత్తుపరంగా కూడా పెరుగుతూ వచ్చింది.

మిచీ కికుచి ఎత్తును కొలుస్తున్న గిన్నిస్​ వరల్డ్ రికార్డ్ అధికారులు
గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్ అందుకున్న ట్విన్ సిస్టర్స్​

యోషి ప్రస్తుతం విడిగా ఉంటుండగా.. మిచీ మాత్రం తన తండ్రితో కలిసి ఉంటోంది. ప్రస్తుతం వీరి తండ్రి ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా ఉండగా, అతడికి సాయంగా మిచీ ఉంటోంది. తనకు వచ్చిన అరుదైన వ్యాధి కారణంగా మిచీ ఎత్తు పెరగకపోగా.. చాలాసార్లు హైట్​ తక్కువగా ఉన్నందున అవమానాలు భరించాల్సి వచ్చింది. కానీ ఆమెకు తన కన్నా ఎత్తు తక్కువ ఉన్న చంద్ర బహదూర్ డాంగీ గురించి తెలుసుకున్న తర్వాత.. తనపై తనకు నమ్మకం వచ్చిందని తెలిపింది. తాను ప్రపంచంలో ఎంతో ప్రత్యేకం అని గుర్తించిన మిచీ.. ప్రత్యేక గుర్తింపును సాధించడానికి ముందుకు వచ్చింది.

యోషి, మిచీ కికుచిల చిన్ననాటి ఫొటో

మహిళా కవలల్లో అత్యధిక ఎత్తు తేడా కలిగిన వ్యక్తులుగా యోషితో పాటు తన పేరును నమోదు చేసుకోవాలని మిచీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యోషి ఎత్తు 162.5సెం.మీ (5అడుగుల 4అంగుళాలు), మిచీ 87.5సెం.మీ (2అడుగుల 10.5అంగుళాలు) ఎత్తును కలిగి ఉండగా.. వీరిద్దరి మధ్య ఎత్తు వ్యత్యాసం 75సెం.మీ (2అడుగుల 5.5అంగుళాలు) ఉండటం అనేది ఎంతో ప్రత్యేకమని మిచీ గుర్తించింది.

మిచీ కికుచి

దీంతో తమ పేర్ల మీద రికార్డును క్రియేట్ చేయడానికి మిచీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​ వారిని సంప్రదించింది. మిచీ అభ్యర్థన మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గతంలో కవలల మధ్య ఉన్న ఎత్తు తేడాను బేరీజు వేసి.. మిచీ, ఆమె సోదరి యోషిల మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసాన్ని లెక్కించారు. వారి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం యోషి, మిచీల మధ్య ఎత్తుల తేడా ఎక్కువగా ఉందని వారు తెల్చారు. దీంతో మిచీ, యోషిలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించారు.

తల్లితో పాటుగా కవల సోదరీమణులు యోషి, మిచీ కికుచి

ABOUT THE AUTHOR

...view details