Jaishankar Russia Visit :భారత్‌కు రష్యా విలువైన, కాలపరీక్షకు నిలిచిన భాగస్వామి అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. మాస్కోలో పర్యటిస్తున్న ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఉన్న సంబంధాల ద్వారా ఇరుదేశాలు విస్తృతంగా ప్రయోజనం పొందినట్లు చెప్పారు. అంతర్జాతీయ వ్యుహాత్మక పరిస్థితులు, ఘర్షణలు, ఉద్రిక్తతలు, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.
మోదీ-పుతిన్‌లు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారని, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, భిన్న ధ్రువ ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేవడంపై దృష్టి సారించామని జైశంకర్ వివరించారు. ప్రత్యేకమైన తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. జీ-20, షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్, ఆసియాన్, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలు వరుస భేటీలకు దోహదం చేస్తున్నాయని జైశంకర్ పేర్కొన్నారు.
మోదీకి పుతిన్ ఆహ్వానం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ క్రెమ్లిన్‌లో బుధవారం భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలపై ఆయనతో చర్చించారు. వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి పుతిన్ ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. వర్తమాన అంశాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం శాంతియుతంగా పరిష్కృతమవ్వాలని మోదీ కోరుకుంటున్న సంగతి తనకు తెలుసని పుతిన్ పేర్కొన్నారు. దాని గురించి తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిపై భారత్‌కు మరింత అదనపు సమాచారం అందజేస్తామన్నారు. భారత్‌తో తమ దేశ వాణిజ్య లావాదేవీల్లో వరుసగా రెండో ఏడాది గణనీయ పెరుగుదల నమోదవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ముడి చమురు, అత్యాధునిక సాంకేతిక రంగాలు ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.