Jaishankar Meets Blinken :కెనడాతో దౌత్య వివాదంతలెత్తిన తర్వాత తొలిసారి భారత్-అమెరికా మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రక్షణ, స్పేస్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాల సమన్వయంపై చర్చించారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందని జైశంకర్ ట్వీట్ చేశారు. విస్తృత స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలో జరగబోయే 2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.
దిల్లీ వేదికగా 2+2 మంత్రుల భేటీ..
India US 2+2 Dialogue 2023 Delhi :అమెరికా విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలోజీ20కి భారత్ నేతృత్వంలో లభించిన ఫలితాలు, ఇండియా-మిడిల్‌ఈస్ట్-యూరోప్ కారిడార్, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై పెట్టుబడులు వంటి అంశాలను భారత్-అమెరికా విదేశాంగ మంత్రులు మాట్లాడుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో భారత్‌లో జరిగిన జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడిని హోస్ట్ చేసినందుకు జై శంకర్‌కు.. బ్లింకెన్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో దిల్లీ వేదికగా జరగబోయే 2+2 మంత్రుల భేటీ గురించి కూడా చర్చించామని వెల్లడించారు.
బ్లింకెన్ అనాసక్తి..
అయితే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ వ్యవహారం విదేశాంగ మంత్రుల భేటీలో చర్చకు వచ్చిందా లేదా అనే విషయం వెల్లడికాలేదు. నిజ్జర్ వల్ల ఇరు దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడిన ప్రభావాలపై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిరాకరించారు.
జైశంకర్‌ను విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉందని జీ20, ఐరాస జనరల్ అసెంబ్లీ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయని బ్లింకెన్ వెల్లడించారు. భేటీకి ముందు స్టేట్ డిపార్ట్‌మెంట్ ట్రీటీ రూమ్‌లో జరిగిన ఫొటో సెషన్‌లో ఇరు దేశాల మంత్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.