తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎర్ర సముద్రంలో నౌక హైజాక్‌ వీడియో రిలీజ్- నేరుగా హౌతీలతో మాట్లాడుతున్న జపాన్ - గెలాక్సీలీడర్‌ సరకు రవాణా నౌక హైజాక్‌ చేసిన వీడియో

Israel ship hijacked : ఆదివారం ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్​కు చెందిన గెలాక్సీలీడర్‌ నౌకను స్వాధీనం చేసుకున్న వీడియోను హౌతీరెబల్స్‌ విడుదల చేశారు. గాజాపై యుద్ధాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌పై సముద్ర దాడులు చేస్తామని హౌతీ అధికార ప్రతినిధి మరోసారి హెచ్చరించారు.

Israel ship hijacked
Israel ship hijacked

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 7:34 AM IST

Updated : Nov 21, 2023, 10:32 AM IST

Israel Ship Hijacked Video : గెలాక్సీలీడర్‌ అనే సరకు రవాణా నౌకను హైజాక్‌ చేసిన వీడియోను హౌతీరెబల్స్‌ బహిర్గతం చేశారు. ఎర్ర సముద్రంపై వెళుతున్న ఆ కార్గో షిప్‌ను ఓ హెలికాప్టర్​తో వెంబడించి రెబల్స్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. హాలీవుడ్‌ సినిమాలో యాక్షన్‌ సీన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

హైజాక్ చేశారిలా...
తిరుగుబాటుదారులు హెలికాప్టర్‌లో ఎర్రసముద్రంపై ఉన్న నౌక దగ్గరకు చేరుకున్నారు. షిప్‌పై ఎవరూ లేని సమయంలో హెలికాప్టర్‌ ఓడ డెక్‌పై ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన హౌతీరెబల్స్‌ నినాదాలు చేస్తూ, కాల్పులు జరుపుతూ పరిగెత్తి.. వీల్‌హౌస్, కంట్రోల్ సెంటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత నౌకను యెమెన్‌లోని సలీఫ్ పోర్టుకు మళ్లించారు. ఓడపై దాడి కేవలం ఆరంభం మాత్రమే అనీ.. గాజాపై యుద్ధాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌పై సముద్ర దాడులు చేస్తామని హౌతీ అధికార ప్రతినిధి తెలిపారు. నౌక తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో హైజాక్‌ జరిగింది. అందులోని 25 మంది సిబ్బందిని హౌతీ రెబల్స్‌ బందీలుగా తీసుకున్నారు. కాగా.. ఆ నౌక తమది కాదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే రెబల్స్‌ శపథం చేశారు.

తిరుగుబాటు దారులతో జపాన్ సంప్రదిపులు :
కార్గో నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులను నేరుగా సంప్రదిస్తున్నట్లు జపాన్ తెలిపింది. గెలాక్సీ లీడర్‌ను విడుదల చేయించేందుకు ఇతర దేశాలతో పాటు.. ఇజ్రాయెల్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన జపాన్ ప్రభుత్వం... తిరుగుబాటుదారుల నుంచి నౌకను విడుదల చేయించేందుకు కృషి చేయాలని ఇరాన్, సౌదీ అరేబియా, ఒమన్​ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
కాగా, నౌక హైజాక్ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఖండించారు. దీనిని చాలా తీవ్రమైన సంఘటనగా పేర్కొన్నారు.

మరో ఆస్పత్రిపై దాడి
గాజాలోని ఆస్పత్రులే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ దళాలు మరో ఆస్పత్రిపై భీకరదాడులు చేశాయి. ఉత్తరగాజాలోని ఇండోనేషియా ఆస్పత్రి రెండో అంతస్తుపై శతఘ్నులతో దాడులు చేశాయి. ఫలితంగా 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆస్పత్రి పరిసరాల్లో యుద్ధం జరుగుతోందనీ.. రోగులను తీసుకుని లేదా.. ఒంటరిగానైనా పారిపోవాలని వైద్య సిబ్బందికి ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు పంపింది. ఉత్తర గాజాలో ఆస్పత్రులను హమాస్‌ తమ స్థావరాలుగా చేసుకుంటోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. తమ దేశ పౌరులను కూడా ఆస్పత్రుల్లోనే బందీలుగా ఉంచిందని చెబుతోంది. అటు అల్‌ షిఫా ఆస్పత్రి నుంచి తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందికి తమ దేశంలో చికిత్స అందిస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది.

Last Updated : Nov 21, 2023, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details