Israel Security At Border : కాల్పుల విరమణ ఒప్పందం ముగియడం వల్ల ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం గాజా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఈ ఏర్పాట్లపై తమ ప్రతిపాదనను అరబ్ దేశాలకు తెలియజేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సీనియర్ సలహాదారుడు మార్క్ రెగెవ్ వెల్లడించారు.
'యుద్ధం ముగియగానే గాజా సరిహద్దుల నుంచి..'
Israel Security Arrangements : "సరిహద్దులను దాటుకుని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి ప్రజలను చంపారు. యుద్ధం ముగిసిన తర్వాత భవిష్యత్తులో ఉగ్రవాదుల నుంచి మా ప్రజలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకోసం యుద్ధం ముగియగానే గాజా సరిహద్దుల నుంచి హమాస్‌ను తొలగించి దాడులను నిరోధించేలా ఆ ప్రాంతంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలి. గాజా సరిహద్దులో పాలస్తీనా వైపుగా కట్టుదిట్టమైన భద్రతా బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఈ విషయంలో అరబ్ దేశాలతో భాగస్వామ్యం పంచుకుంటాం" అని మార్క్ రెగెవ్ తెలిపారు.
ఇజ్రాయెల్ దాడిలో మా సైనికుల మృతి: ఇరాన్
Israel Attack On Gaza Latest News : అయితే సిరియాపై ఇజ్రాయెల్ శనివారం జరిపిన వైమానిక దాడిలో తమ దేశానికి చెందిన ఇద్దరు పారామిలిటరీ రివల్యూషనరీ గార్డులు మృతి చెందారని ఇరాన్ వెల్లడించింది. వారు సిరియాకు సలహా మిషన్‌పై వెళ్తున్నారని తెలిపింది. మరోవైపు శనివారం ఉదయం సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో పలు వైమానిక దాడులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. హెజ్‌బొల్లాతో కలిసి పనిచేసే మిలిటరీ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపింది. ఈ దాడుల్లో ఇద్దరు సిరియా పౌరులు మృతి చెందారని పేర్కొంది.