Israel Hamas War Iran Requests India :గాజాలో మారణహోమాన్ని ఆపేందుకు భారత్.. తన అన్ని సామర్థ్యాలను వినియోగించాలని ఇరాన్ అభ్యర్థించింది. పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవాద విధానానికీ, సోవియట్ ఒత్తిడికి తలొగ్గని తటస్థ వైఖరి గల చరిత్ర.. భారత్‌కు ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఫోన్‌లో సంభాషించారు. గాజాలో ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజలపై ఇజ్రాయెల్ నరమేధాన్ని అంతం చేసేందుకు భారత్ తన సామర్థ్యాలను ఉపయోగించాలని అభ్యర్థించారు.
Iran On Israel Hamas War :యుద్ధవిరమణ, బాధితులకు మానవతాసాయం చేసేందుకు ప్రపంచం చేసే ఏ పనికైనా ఇరాన్ మద్దతిస్తుందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ నుంచి తమను రక్షించుకునేందుకు పాలస్తీనా పోరాట గ్రూపులకు హక్కు ఉందని తెలిపారు. నాజీ జర్మనీకి వ్యతిరేకంగా అప్పట్లో ఐరోపా దేశాలు ఎలా పోరాటం చేశాయో.. పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. చిన్నపిల్లలు, మహిళలు, ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్థి శిబిరాలు, మసీదులు, చర్చిలపై జరిగే దాడులను ఖండించాలని కోరారు. భారత్, ఇరాన్ దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచిన చాబహార్ పోర్టును ప్రస్తావించిన రైసీ.. ఇరుదేశాల సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
యుద్ధానికి విరామం!
Israel War Stop :హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై నెల రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. వ్యూహాత్మకంగా స్వల్ప విరామం ప్రకటించేందుకు అంగీకరించింది. ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీల నిష్క్రమణకు వీలుగా వ్యూహాత్మకంగా స్వల్ప విరామాలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.
'యుద్ధం తర్వాత కూడా గాజాను మేమే..'
గాజాపై తమ దేశం చేస్తున్న యుద్ధానికి సాధారణ కాల్పుల విరమణ ఆటంకం కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. పూర్తి స్థాయి కాల్పుల విరమణను హమాస్ అనుకూలంగా మార్చుకొని.. తిరిగి బలపడే ప్రమాదం ఉందని అమెరికా కూడా భావిస్తోంది. అయితే మానవతా కారణాలతో ప్రదేశాలవారీగా దాడులకు స్వల్ప విరామం ప్రకటించే విషయాన్ని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక దాడులకు స్వల్ప విరామాలను గంట చొప్పున ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మానవతాసాయం గాజా లోపలికి రావడానికి లేదా తమ దేశ బందీలు, విదేశీ బందీలు గాజాను వీడటానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గాజాలో సుదీర్ఘకాలం భద్రతను తామే పర్యవేక్షించాల్సి ఉంటుందన్న నెతన్యాహు.. ఇంతకాలం పట్టించుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు.