Israel Attack On Gaza Latest News : హమాస్ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా.. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 52 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు.
అమెరికా విజ్ఞప్తి చేసిన కాసేపటికే..
Israel Gaza Update Today : గాజా పౌరులకు సాయం చేయడానికి దాడులకు విరామం ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసినా దానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. తర్వాత కాసేపటికే ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 9,480 మంది పౌరులు మరణించారని.. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పాఠశాలపై జరిపిన దాడుల్లో 12 మంది..
Israel Gaza War 2023 : వేలాది మంది ఆశ్రయం పొందుతున్న ఐక్యరాజ్యసమితి పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది చిన్నారులు మరణించారని హమాస్ తెలిపింది. అయితే గాజాను.. హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ సెంటర్‌గా పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్.. తమ బలగాలు గాజాను చుట్టుముట్టాయని వెల్లడించారు. గాజాలో ఇప్పటివరకు 12 వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు!
Israel Gaza America : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. కాల్పుల విరమణపై చేసిన ప్రతిపాదనను నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరించింది. అయితే పశ్చిమాసియాలో అరబ్ నేతలతో బ్లింకెన్ సమావేశమవుతూ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లింకెన్ జోర్డాన్‌లో అరబ్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. గాజాలో జరుగుతున్న దాడులపై బ్లింకెన్ ముందు అరబ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 3న్నర నుంచి 4 లక్షల మంది పౌరులు ఉత్తర గాజాలోనే ఉన్నారని.. వారికి ఏదైనా జరిగితే ఇజ్రాయెల్‌దే బాధ్యత అని అరబ్ దేశాలు హెచ్చరించాయి.