Israel Attack On Gaza 2023 : గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా మరో భారీ దాడికి పాల్పడింది. గాజాలో ప్రధాన ఆస్పత్రి అల్-షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించడం వల్ల అంబులెన్స్ వాహనశ్రేణి ఛిద్రమైది. ఈ దాడిలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించాయి. అంబులెన్సుల బయట చాలా మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
Israel Gaza War Update Today : అల్-షిఫా ఆస్పత్రి ప్రాంగణంలోనే హమాస్ ప్రధాన స్థావరం ఉందని ఇజ్రాయెల్ కొన్నిరోజులుగా చెబుతోంది. పాలస్తీనా పౌరుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, మానవతా సాయం అందించేందుకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన అభ్యర్థనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్నవారందరినీ విడిచి పెడితేనే విరమణ సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 9 వేల 227 మంది పౌరులు మృతి చెందారని గాజా వైద్యశాఖ తెలిపింది.
మోదీ-సునాక్ చర్చలు!
Modi Sunak Talk :మరోవైపు, పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఫోన్‌లో చర్చించుకున్నారు. ఉగ్రవాదం, యుద్ధంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇరువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై రిషి సునాక్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదం, హింసకు చోటు లేదన్న విషయాన్ని తాము అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.