తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్‌ రాజధానిలో ఆందోళనకారుల విధ్వంసం.. వెనుక ఉన్నది ఎవరు? - President of Brazil Luiz Inacio Lula da Silva

బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో జరిగిన విధ్వంసంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆందోళనకారుల బస్సులకు చెల్లింపులు ఎవరు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. అసలు ఆ ఆందోళనల వెనుక ఉన్నది ఎవరు?

investigation-into-unrest-destruction-in-brasilia-capital-of-brazil
Etv బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో విధ్వంసం

By

Published : Jan 11, 2023, 6:54 AM IST

బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో ఆదివారం వేల మంది ఆందోళనకారులు కీలకమైన అధికార భవనాలను ముట్టడించడంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాజధానికి ఆందోళనకారులను తీసుకొచ్చిన బస్సులకు ఎవరు చెల్లింపులు చేశారన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారని న్యాయశాఖ మంత్రి ఫ్లావియో డినో సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

మొత్తం 100 బస్సుల్లో నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరించాలన్న భావనలో వారంతా కనిపించారని డినో చెప్పారు. వారిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దుర్భరస్థితి ముగిసిందని మేం భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం నాటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అతిక్రమించిన వారిని, ఆందోళనకారులను రెచ్చగొట్టిన వారిని శిక్షించడంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.

మరోపక్క దాడిని ఖండిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న ఓ లేఖపై బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా సహా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సెనేట్‌, దిగువసభల అధిపతులు సంతకాలు చేశారు.
ఇటీవల జరిగిన బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో జైర్‌ బోల్సొనారో ఓటమి పాలయ్యారు. దీంతో దేశాధ్యక్షుడిగా లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా వారం రోజుల క్రితమే అధికారం చేపట్టారు. దీన్ని తట్టుకోలేని బోల్సొనారో మద్దతుదారులు ఆదివారం బ్రసీలియాలో విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రిలో బోల్సొనారో..
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. బ్రెజిల్‌లో బోల్సొనారో మద్దతుదారులు అరాచకం సృష్టించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కడుపునొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సతీమణి మిషెల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. తాజా అల్లర్ల నేపథ్యంలో బోల్సొనారోను ఫ్లోరిడా నుంచి పంపించాలని జో బైడెన్‌ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బోల్సొనారో ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details