అన్నం కోసం ఆమె చెత్తబుట్టలో వెతికేది. ఇంటికి ఓ శునకంలా తనను కట్టేయగా.. రాత్రంతా కాపలా కాసేది. ఓ పనిమనిషికి పెట్టిన చిత్రహింసలు ఇవి. కుమార్తెతో కలిసి పనిమనిషిని వేధించి ఆమె మరణానికి కారణమైన భారత సంతతి మహిళ ప్రేమ ఎస్.నారాయణ స్వామికి సింగపూర్ కోర్టు సోమవారం 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆమె తన కుమార్తె గాయత్రి మురుగయన్‌తో కలిసి 24 ఏళ్ల పనిమనిషి ప్యాంగ్ ఎన్గియ డాన్‌పై వికృతంగా దాడి చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
కుమార్తెతో కలిసి పనిమనిషికి చిత్రహింసలు.. భారత సంతతి మహిళకు 14ఏళ్ల జైలు శిక్ష - Woman tortures maid with daughter
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళకు అక్కడి కోర్టు.. 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. కుమార్తెతో కలిసి పనిమనిషికి చిత్రహింసలు పెట్టిన కేసులో తీర్పు వెల్లడించింది.
దాడుల ఫలితంగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి 2016లో ఆమె చనిపోయారు. మెదడుకు తీవ్ర గాయాలై కోలుకోలేక మరణించిందని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన న్యాయస్థానం 2021లో గాయత్రికి 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. దర్యాప్తు కొనసాగిస్తూ తల్లిని విచారించగా పనిమనిషిపై ఇద్దరూ కలిసి చిత్రహింసలకు పాల్పడినట్లు తేలింది. రాక్షసంగా దాడులు చేయడంతోపాటు ఆమె మెడపై సూదులతో గుచ్చడం, టవల్‌తో మెడ బిగించడం, గరిటెతో కొట్టడంలాంటి పైశాచికత్వాన్ని ప్రదర్శించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. మే 2015లో పనికి కుదిరినప్పుడు 39కిలోల బరువున్న మహిళ ఎన్గియ.. చనిపోయే సమయంలో 25 కిలోలకు తగ్గింది. మరణానికి ముందు రోజుల్లో వివిధ రకాలుగా చిత్రహింసలకు గురిచేశారని న్యాయస్థానానికి ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇంతటి దుర్భర వేధింపులు సింగపూర్ చరిత్రలోనే లేవని వెల్లడించింది.