భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమై వేలాదిమంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్ ఘర్షణను షీ జిన్‌పింగ్ ఘనతగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(CPC) ప్రచారం చేస్తోంది. సీపీసీ 20వ జాతీయ మహాసభ వేదికపై పదేళ్లలో జిన్‌పింగ్ సాధించిన విజయాలను ప్రదర్శించారు. ఇందులో గల్వాన్‌లో భారత్-చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు. ఈ చిత్రాల్లో పీఎల్‌ఏ కమాండర్ క్వీ ఫాబోవా రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు. గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి చైనా ప్రచార విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లింది.
పీఎల్‌ఏ కమాండర్ క్వీ ఫాబోవా కూడా సీపీసీ జాతీయ మహాసభకు హాజరయ్యాడు. ఈ మహాసభకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 304 మంది ప్రతినిధుల్లో క్వీ ఫాబోవా కూడా ఒకడు. గతంలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా క్వీ ఫాబోవాను చైనా ఎంపిక చేసింది. ఇందుకు నిరసనగా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనలేదు. ఈ వేడుకలను దూరదర్శన్ కూడా ప్రసారం చేయలేదు. అప్పట్లో అమెరికా సైతం చైనా చర్య సిగ్గు చేటు అంటూ విమర్శించింది. మరోవైపు యుద్ధంలో పాల్గొని విజయం సాధించడానికి చైనా బలగాలకు శిక్షణ తీవ్రతరం చేయనున్నట్లు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. ఐతే ఏ దేశం పేరునూ ఆయన ఇందులో పేర్కొనలేదు.