Imran Khan No-confidence motion: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఏప్రిల్ 3న ఓటింగ్ జరగనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కుతారా అంటే కష్టమే అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. తన కేబినెట్‌కు చెందిన సొంత మంత్రులే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జాతీయ అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇమ్రాన్‌కు ఉన్న బలమెంత..? విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గగలరా..?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 149 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజార్టీ లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రులతో ఇమ్రాన్ ఖాన్ చేతులు కలపడంతో సంఖ్యా బలం 176కు పెరిగింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది కాలానికే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడు పాకిస్థాన్ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు సైన్యం కూడా ఆయనపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇమ్రాన్‌పై అసమ్మతి సెగ మొదలైంది.
ఈ క్రమంలోనే ఆయనను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదిపాయి. జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు ఇమ్రాన్‌పై సొంత పార్టీకి చెందిన ఎంపీలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ తంటాలు పడుతున్నారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
ప్రభుత్వ సంఖ్యా బలం ఇలా..
- పీటీఐ - 155
- ఎంక్యూఎంపీ - 7
- పీఎంఎల్(క్యూ) - 4
- బీఏపీ - 1
- గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్ - 3
- ఏఎంఎల్ - 1