Imran Khan On No Confidence Motion: పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. అవిశ్వాసంపై ఓటింగ్ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తానని.. అయితే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే ముందు బెదిరింపు లేఖను పరిశీలించి ఉండాల్సిందన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్‌పై.. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పాలన మార్పును.. అమెరికా దౌత్యవేత్త బెదిరిస్తున్నారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటు, మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణతో మెజార్టీ కోల్పోయిన ఇమ్రాన్.. విపక్షాలను దెబ్బతీసేందుకు జాతీయ అసెంబ్లీని రద్దుచేశారు. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలను పాకిస్థాన్ సుప్రీంకోర్టు తిప్పికొట్టిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. చివరి బంతివరకు పోరాటం చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన ఇమ్రాన్..జాతీయ అసెంబ్లీలో మెజార్టీలేని కారణంగా పరువు నిలబెట్టుకునేందుకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.