Illegal immigrant wins lottery: కోట్ల రూపాయల లాటరీ తగిలినా.. సరైన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల ఆ సొమ్మును తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు ఓ అభాగ్యుడు. గడువు ముగిసేలోగా అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించి, తన తలరాతను మార్చుకునేందుకు దేశంకాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నాడు. అల్జీరియా నుంచి బెల్జియంకు 'అక్రమంగా' వలస వచ్చిన ఓ శరణార్థి కథ ఇది.
రూ.400 ఖర్చు.. రూ.2కోట్ల జాక్‌పాట్: జేబ్రుగా.. బెల్జియంలోని ఓ తీరప్రాంత నగరం. పక్క దేశాల శరణార్థులు ఎక్కువగా జేబ్రుగా మీదగానే బెల్జియంలోకి వలస వస్తారు. అదే తరహాలో కొంతకాలం క్రితం 28 ఏళ్ల యువకుడు ఎలాంటి లగేజీ, సర్టిఫికెట్లు లేకుండా అల్జీరియా నుంచి వచ్చాడు. జేబ్రుగాలో దిగగానే 5 యూరోలు (సుమారు రూ.413) ఖర్చు చేసి ఓ స్క్రాచ్ కార్డ్ కొన్నాడు.
దేశం కాని దేశంలో, అయినవారికి దూరంగా ఎలా బతకాలా అని మదనపడుతున్న ఆ వ్యక్తికి ఓ రోజు మెరుపులాంటి వార్త అందింది. స్క్రాచ్ కార్డ్ లక్కీడ్రాలో ఎంపికైందని, అతడికి రెండున్నర లక్షల యూరోలు (సుమారు రూ.2 కోట్ల 68లక్షల 42వేలు) లాటరీ తగిలిందన్నది దాని సారాంశం. ఈ విషయాన్ని అతడు నమ్మలేకపోయాడు. స్క్రాచ్ కార్డ్ కొన్న దుకాణానికి వెళ్లి ఒకటికి రెండుసార్లు నిర్ధరించుకున్నాడు.
గెలిచాడు.. కానీ..: జాక్‌పాట్ తగిలిందన్న ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. బెల్జియం నిబంధనల ప్రకారం.. లాటరీ సొమ్ము తీసుకోవాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి గుర్తింపునకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించాలి. అయితే.. కట్టుబట్టలతో వలస వచ్చిన అతడి వద్ద అలాంటివేవీ లేవు. ఇప్పటికిప్పుడు ధ్రువపత్రాలు తీసుకురాలేడు.. అలా అని కోట్ల రూపాయల్ని వదులుకోలేడు. ఫలితంగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ వ్యక్తి.
ప్లాన్ రివర్స్: బెల్జియంలోనే గుర్తింపు కార్డులు ఉన్న స్నేహితుల సాయంతో లాటరీ సొమ్ము తెప్పించుకుందామని అనుకున్నాడు ఆ వ్యక్తి. స్క్రాచ్ కార్డ్ ఇచ్చి వారిని లాటరీ సంస్థ కార్యాలయానికి పంపాడు. అయితే.. ఆ కంపెనీ వాళ్లు స్టోర్‌లో స్క్రాచ్ కార్డ్ కొన్నప్పటి సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. డబ్బు తీసుకునేందుకు వచ్చిన వారిలో స్క్రాచ్ కార్డ్ కొన్న వ్యక్తి లేడని వారికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా అతడి స్నేహితులు ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది.
టిక్ టిక్ టిక్.. 11 నెలలే..: ఈ కేసు నేపథ్యంలో లాటరీ టికెట్‌ను బ్రూజ్ నగరంలోని ఓ కోర్టు హోల్డ్‌లో పెట్టింది. అవసరమైన ధ్రుపత్రాలన్నీ సమర్పించి, జాక్‌పాట్ సొమ్మును తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే.. స్క్రాచ్ కార్డ్ గడువు 12 నెలలే. ఇప్పటికే నెల గడిచిపోయింది. అంటే మరో 11 నెలల్లో అతడు ధ్రువపత్రాలన్నీ సమర్పించి, బెల్జియంలో బ్యాంకు ఖాతా తెరిచి.. లాటరీ సొమ్ము విత్‌డ్రా ప్రక్రియ పూర్తిచేయాలి. కాస్త కష్టమే అయినా.. చేయగలం అంటున్నాడు ఆ అదృష్టవంతుడి లాయర్. మరోవైపు.. ఆ వ్యక్తి అక్రమంగా వలస వచ్చినా.. లాటరీ టికెట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేవరకు అతడ్ని స్వదేశానికి తిరిగ పంపబోమని బెల్జియం అధికారులు హామీ ఇచ్చారు.