ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు భగ్గుమన్నాయి. అధ్యక్షుడు బాంగ్‌బాంగ్ మార్కోస్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ఆందోళనకారులు రోడ్డెక్కారు. హక్కుల సంఘాల కూటమి కరపటన్ ఆధ్వర్యంలో సుమారు 800 మంది నిరసనకారులు పబ్లిక్ స్క్వేర్ నుంచి అధ్యక్ష భవనానికి లాంగ్ మార్చ్ చేపట్టారు. అవినీతి, హత్యలను ప్రశ్నించిన వారంతా చనిపోతున్నారని కొందరు ఆచూకీ లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడి తండ్రి, ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్, రోడ్రిగో డ్యూటెర్టేల హయాంలలో డ్రగ్స్‌పై పోరాటం చేసిన వేలమంది మరణించినట్లు గుర్తు చేశారు. వారికి ఇంకా న్యాయం జరగలేదని వాపోయారు.
ఫిలిప్పీన్స్ రోడ్లపై 800 మంది ఆందోళన.. 'రాజకీయ ఖైదీ'లు పెరిగిపోతున్నారని ఆవేదన - బాంగ్‌బాంగ్ మార్కోస్ వ్యతిరేకంగా నిరసనలు
ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడికి వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లెక్కారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ హత్యలు పెరిగిపోతున్నాయని, ప్రశ్నించిన వారిని జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బాధితుల కుటుంబీకులు పాల్గొన్న ఈ ఆందోళనల్లో.. దేశంలో రాజకీయ ఖైదీలు పెరిగినట్లు వివరించారు. నవంబర్ నాటికి 828 రాజకీయ ఖైదీలుగా ఊచలు లెక్కిస్తున్నట్లు తెలిపారు. అందులో 25 మందిని బాంగ్‌బాంగ్ మార్కోస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి కుటుంబీకులు వేల కోట్లు సంపద పోగేసుకున్నట్లు ఆరోపించారు. విప్లవకారులను అణిచేందుకు ప్రభుత్వం తీవ్రవాద చట్టాలను ప్రయోగిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని కరపటన్ సభ్యులు వెల్లడించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.