Indians How to get US Visa in Telugu : కొన్ని సంవత్సరాల క్రితం భారత్ నుంచి ఇతర దేశాలకు చాలా తక్కువ మంది మాత్రమే వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. ప్రధానంగా ఇండియా నుంచి యూఎస్(USA) వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఎవరైనా అక్కడకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. విహారయాత్ర, ఉన్నత చదవులు, వ్యాపారం ఇలా దేని కోసం వెళ్లాలన్నా ముందుగా మీరు ఆ దేశం వీసా కలిగి ఉండాలి. గతంలో ఈ వీసా పొందాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పెరుగుతున్న ప్రయాణికుల దృష్ట్యా కొన్ని నిబంధనలు సడలించారు. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న కొద్ది రోజులకే వీసా(US Visa)వచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇంతకీ యూఎస్ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి? ఏయే ఏయే పత్రాలు అవసరం? ఎన్ని రోజుల్లో వీసా వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
America Visa Application Process :భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి వీసా అవసరం. US వలస, వలసేతర వీసాలను అందిస్తుంది. ఎవరైనా యూఎస్ వీసా పొందాలంటే ముందుగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రక్రియకు దరఖాస్తుదారులు దరఖాస్తును పూర్తి చేసి, US కాన్సులేట్, వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఆ తర్వాత మీరు వీసా పొందుతారు. అమెరికా భారతీయులకు US విజిటర్ వీసా, US వర్క్ వీసా, US విద్యార్థి వీసాలు మంజూరు చేస్తుంది.
How to Apply for a US Visa in Telugu :
US వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- ముందుగా US నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని దశలు ఇక్కడ వివరించబడ్డాయి.
- తొలుత మీరు దరఖాస్తు చేయాల్సిన వీసా రకాన్ని గుర్తించాలి. అవసరమైతే సహాయం కోసం US వీసా విజార్డ్ని సంప్రదించవచ్చు.
- ఆ తర్వాత DS-160 ఫారమ్‌ను పూర్తి చేయడానికి మార్గదర్శకాలను చదవాలి. ఆపై వీసా దరఖాస్తు పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
- అనంతరం DS-160 ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఆపై దరఖాస్తు ఫారమ్ నిర్ధారణ పేజీని ముద్రించాలి.
- US వీసా కోసం నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా దరఖాస్తుదారులు వారి తాజా ఫొటోగ్రాఫ్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
- అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికలతో వీసా దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
- ఆ తర్వాత రెండు అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవాలి. ఒకటి వీసా దరఖాస్తు కేంద్రం (VAC)లో బయోమెట్రిక్, ఫోటో నమోదు. రెండోది సమీప US ఎంబసీ లేదా కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ.
- అనంతరం బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయాలి. ఆపై మీ దరఖాస్తు ఫారమ్, అవసరమైన అన్ని పత్రాలతో వీసా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ప్రాసెసింగ్ కోసం మీ అన్ని పత్రాలను సమర్పించాలి.
అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి, మీకు కింది సమాచారం అవసరం పడుతుంది.
- మీ పాస్‌పోర్ట్ నంబర్.
- వీసా దరఖాస్తు రుసుము రసీదు సంఖ్య.
- మీ DS-160 కన్ఫర్మేషన్ పేజీ నుంచి పది (10) అంకెల బార్‌కోడ్ నంబర్.
మీ అపాయింట్‌మెంట్‌లకు హాజరైనప్పుడు, మీరు ఈ క్రింది వాటిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి.
- మీ పాస్‌పోర్ట్.
- మీ DS-160 కన్ఫర్మేషన్ పేజీ.
- మీ అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ పేజీ.
- US వీసా స్పెసిఫికేషన్‌లకు ఒక్కో ఫొటో.
ఇలా మీరు మీ అపాయింట్‌మెంట్‌లను పూర్తి చేసి.. మీ మొత్తం దరఖాస్తును సమర్పించిన తర్వాత వీసా నిర్ణయం కోసం వేచి ఉండాలి. ఆ తర్వాత మీరు మీ పాస్‌పోర్ట్ డాక్యుమెంట్‌లను తీసుకోగల సమయం, తేదీ మీకు ఈమెయిల్, SMS ద్వారా తెలియజేయబడుతుంది.