Houthi Attacks In Red Sea :అమెరికా, బ్రిటన్ ఇతర మిత్రదేశాలు కలిసి యెమెన్‌లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేస్తున్నా మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా యెమెన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న అమెరికా నౌక జిబ్రాల్టర్ ఈగిల్పైకి హౌతీ రెబల్స్ క్షిపణిని ప్రయోగించారు. ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకపైకి యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసి 24 గంటలు గడవకముందే ఈ దాడి చేయడం గమనార్హం. ఆడెన్‌కు ఆగ్నేయ దిశలో 110 మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు UK మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ తెలిపింది. యెమెన్‌లోని ఓడరేవు వైపు నుంచే మిస్సైల్ దూసుకొచ్చిందని షిప్ కెప్టెన్ నివేదించినట్లు పేర్కొంది.
హౌతీ రెబల్స్ దాడిని అమెరికా సైన్యం నిర్ధరించింది. ఓడకు ఎలాంటి నష్టం వాటిల్లలేదనీ, ప్రస్తుతం అది దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. దాడికి బాధ్యత వహిస్తూ హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపైకి దురాక్రమణ చేసేందుకు దూసుకొచ్చే అమెరికన్, బ్రిటిష్ నౌకలు, యుద్ధనౌకలను యెమెన్ సాయుధ బలగాలు శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తాయని హెచ్చరించారు. హౌతీల తాజా దాడి ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ఇరాన్ దాడులు
మరోవైపు, అర్ధరాత్రి ఇరాక్ ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఇరాన్ సైన్యం వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు ఇరాక్ సైనికులు మృతి చెందారు. అయితే సంకీర్ణ దళాలకు చెందిన సేనలకు, అమెరికన్ సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది.