తెలంగాణ

telangana

ETV Bharat / international

'క్యాపిటల్ హిల్ దాడిలో ట్రంప్ పాత్ర.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై నిషేధం!'

అమెరికాలో 2021 జనవరి 6వ తేదీన క్యాపిట‌ల్ హిల్‌పై జరిగిన దాడిలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని హౌస్ సెలక్ట్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన కమిటీ.. భ‌విష్యత్తులో ట్రంప్ మ‌ళ్లీ అధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధం విధించాల‌ని ప్రతిపాదన చేసింది.

house-select-committee-says-that-trump-has-a-role-in-the-attack-on-the-us-capitol-hill
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

By

Published : Dec 23, 2022, 4:30 PM IST

2021 జనవరి 6వ తేదీన క్యాపిట‌ల్ హిల్‌పై దాడి ఘటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉన్నట్లు దీనిపై దర్యాప్తు చేప‌ట్టిన హౌస్‌ సెలక్ట్‌ క‌మిటీ వెల్లడించింది. 18 నెలల పాటు జరిగిన విచారణలో వెయ్యికిపైగా సాక్షులను విచారించిన కమిటీ లక్షలాది పేజీల డాక్యుమెంట్లను పరిశీలించింది. చివరికి 814 పేజీలతో కూడిన తుది రిపోర్టును హౌస్‌ సెలక్ట్‌ కమిటీ విడుదల చేసింది. క్యాపిట‌ల్ హిల్ దాడికి ట్రంప్ కార‌ణ‌మంటూ ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. భ‌విష్యత్తులో ట్రంప్ మ‌ళ్లీ అధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధం విధించాల‌ని ప్రతిపాదన చేసింది. విచార‌ణ స‌మ‌యంలో ట్రంప్ స‌హ‌క‌రించ‌లేద‌ని కమిటీ పేర్కొంది.

తన మద్దతుదారులను క్యాపిటల్‌ హిల్‌పై దాడి చేయకుండా ఆపడంలో ట్రంప్‌ విఫలమైనట్లు తెలిపింది.2021 జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి పాల్పడ్డారు. జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమవగా వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. బారికేడ్లు దాటుకొని, గోడలు ఎక్కుతూ భవనం లోపలికి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కొద్ది గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రసంగం చేశారు. బైడెన్‌ తన ఓట్లు దొంగలించి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. దీంతో క్యాపిట‌ల్ హిల్‌పై దాడి వెనుక ట్రంప్‌ పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details