తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా రాజకీయాల్లో కొత్త 'ఆట'.. ట్రంప్​ చేతికి ప్రతినిధుల సభ.. ఉక్రెయిన్‌కు మద్దతులో కోత?

రెండేళ్లుగా ఏకపక్షంగా సాగుతున్న అమెరికా రాజకీయాల్లో కొత్త ఆట మొదలైంది. ఆ దేశ పార్లమెంటు (కాంగ్రెస్‌)లోని కీలకమైన ప్రతినిధుల సభ మంగళవారం నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలోని రిపబ్లికన్ల చేతుల్లోకి వచ్చింది. రిపబ్లికన్‌ల మెజార్టీతో కొత్త సభ కొలువుదీరింది. దీంతో రెండేళ్లుగా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినట్లు సాగుతున్న అమెరికా రాజకీయాల్లో వేడి రాజుకున్నట్లైంది. డెమోక్రాట్‌ ప్రభుత్వ బిల్లులు, చట్టాలను అడ్డుకోవటంతో పాటు... అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయాలు, ఆయన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై విచారణకు సైతం రిపబ్లికన్‌లు సిద్ధమవుతుండటమే రాజకీయ వేడికి కారణం!

house-of-representatives-in-hands-of-republicans-led-by-former-president-donald-trump-since-tuesday
రిపబ్లికన్ల చేతుల్లోకి అమెరికా ప్రతినిధుల సభ

By

Published : Jan 4, 2023, 7:00 AM IST

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి తర్వాత... రెండేళ్లుగా రిపబ్లికన్‌ పార్టీ నిస్తేజంగా మారింది. ట్రంప్‌తో పాటు మరికొందరు నేతలపై ఆరోపణలు, విచారణలతో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. అమెరికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. సెనెట్‌, ప్రతినిధుల సభ. కొద్దిరోజుల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సెనెట్‌లో డెమోక్రాట్లకు అతిస్వల్ప ఆధిక్యం లభించింది. ప్రతినిధుల సభను రిపబ్లికన్లు చేజిక్కించుకోవటంతో ట్రంప్‌ పార్టీలో మళ్లీ చురుకుదనం మొదలైంది.

మరో రెండేళ్లలో (2024) అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయటానికి దీన్ని అవకాశంగా రిపబ్లికన్లు భావిస్తున్నారు. దీంతో రాబోయే ఈ రెండేళ్లలో అనేక చట్టాలపై పీటముడి పడటంతో పాటు బైడెన్‌ యంత్రాంగం వ్యవహారాలపై, ముఖ్యంగా ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ వ్యాపార కార్యకలాపాలు, ఉక్రెయిన్‌తో సంబంధాలపై ప్రతినిధుల సభ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. బైడెన్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని కొంతమంది రిపబ్లికన్‌ ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు.

ఉక్రెయిన్‌కు మద్దతులో కోత?
ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయానికి కూడా బ్రేకులు వేయాలని రిపబ్లికన్లు ఆలోచిస్తున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా విచక్షణ రహితంగా సాయం చేస్తోందన్నది రిపబ్లికన్‌ల భావన. స్వదేశంలో అమెరికన్లను మాంద్యంలోకి నెట్టి... అధికధరలు, పెరిగిన ఖర్చుల్లో ముంచుతూ, ఉక్రెయిన్‌కు ఖాళీ చెక్కుపై సంతకం చేసి ఇవ్వటం మూర్ఖత్వమన్నది వారి వాదన. మధ్యంతర ఎన్నికలకు ముందు దీన్నే ప్రధాన ప్రచారాంశంగా కూడా చేసుకున్నారు.

ఉక్రెయిన్‌తో పాటు... విదేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయంపై విచారణ జరుపుతామంటూ రిపబ్లికన్‌ పార్టీ కీలక నేత మెకార్తీ ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి... ఈ రెండేళ్లలో అమెరికా రాజకీయాలు మళ్లీ రంజుగా మారబోతున్నాయి. రెండేళ్లుగా తమపై విచారణలు, దర్యాప్తులతో విరుచుకుపడుతున్న బైడెన్‌కు ముకుతాడు వేయాలని రిపబ్లికన్లు తహతహలాడుతున్నారు. అయితే రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ను సమర్థించే, వ్యతిరేకించే గ్రూపులు ఎలా వ్యవహరిస్తాయనేదానిపైనే ఈ రాజకీయం ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రతినిధుల సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవటంలోనే ఆ పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తంకాలేదు. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విభేదాలెలా సాగుతాయన్నది కీలకం కాబోతోంది.

ABOUT THE AUTHOR

...view details