Hezbollah Israel Conflict : హమాస్ ఆకస్మిక దాడుల నుంచి తేరుకుని ప్రతిదాడులతో గాజాపై యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్‌కు మరో ముప్పు ఎదురుకానుంది. ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌తో భాగమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ఓ ర్యాలీ సందర్భంగా హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అండదండలతో..
Hezbollah Iran Relationship : లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన హిజ్బుల్లా ఇరాన్ అండదండలతో బలీయమైన శక్తిగా ఎదిగింది. ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఈ సంస్థకు ఇరాన్ సాయం చేస్తోంది. హిజ్బుల్లా లక్ష్యం కూడా ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడం వల్ల హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.
లక్షకుపైగా రాకెట్లు!
Hezbollah Israel News : 1980ల్లో లెబనాన్‌లో ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ, మిలటరీ పరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకుపైగా రాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య అధికంగా ఉంది. హిజ్బుల్లాలో లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో హమాస్, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది. రానున్న రోజుల్లో హిజ్బుల్లాతో తలపడితే ఎలాంటి వ్యూహాలను ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.