తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తర కొరియాలో ఆకలి చావులు..! తీవ్ర ఆహార సంక్షోభంలో కిమ్ రాజ్యం ఉక్కిరిబిక్కిరి..

నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్న ఏలుబడిలో ఉత్తర కొరియా మరోసారి తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అణు పరీక్షలతో వైరం కారణంగా అమెరికా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠినమైన లాక్‌డౌన్లు వ్యవసాయ సంక్షోభానికి దారితీశాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా చాలా మంది ఆకలి చనిపోయారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై కిమ్‌ సర్కారు దృష్టిసారించింది.

Food crisis in North Korea news
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్

By

Published : Feb 27, 2023, 12:55 PM IST

ఉత్తర కొరియాలో కిమ్‌ జాంగ్‌ ఉన్ నియంత పోకడలు తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. తీవ్రమైన ఆహార పదార్థాల కొరత కారణంగా చాలా మంది ఆకలితో చనిపోయిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. కరోనా కట్టడి చర్యలకు తోడు పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దిగుమతులకు కూడా అవకాశం లేక.. ఆహార సంక్షోభం తలెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగం పరిస్థితులపై చర్చించారు. ఆహారోత్పత్తులను పెంచేందుకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలను సమీక్షించారని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.

ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై వ్యవసాయ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ, తక్షణం చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలపై కిమ్‌ చర్చించారు. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అధికారిక మీడియా వెల్లడించలేదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇటీవల ఉత్తర కొరియా అధికార పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. 1990వ దశకంలోనూ.. ఇలాంటి సంక్షోభం ఎదురైందని, అప్పట్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయి దుస్థితి లేదని అంటున్నారు.

2011లో కింగ్ జాంగ్ ఉన్న అధికారం చేపట్టినప్పటి నుంచే ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. అమెరికాతో వైరం కారణంగా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠిన లాక్‌డౌన్‌లు.. వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపాయని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, పురుగు మందుల ధరలు అమాంతం పెరగడం వల్ల ఉత్తర కొరియా వ్యవసాయ రంగం కుదేలైందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details