Cars Theft 60 Minutes : కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లను రెప్పపాటులో చోరీ చేశారు కొందరు దుండగులు. ఎంతో చాకచక్యంగా దొంగతనానికి పాల్పడి కేవలం నిమిషం వ్యవధిలోనే కార్లను ఎత్తుకెళ్లారు. సినిమా సీన్లను తలపించే ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ ప్రాంతంలో గత నెల చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వామ్మో.. ఈ దొంగలు యమా స్పీడ్.. 60 సెకన్లలో రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లు చోరీ
ఇంగ్లాండ్‌లో సినిమా సీన్‌ను తలపించే ఓ చోరీ జరిగింది. రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లను దుండగులు కేవలం ఒక్క నిమిషంలో చోరీ చేశారు.
వివరాల్లోకి వెళితే..
నవంబరు 11న తెల్లవారుజామున ఎస్సెక్స్ ప్రాంతంలోని బుల్ఫాన్ పారిశ్రామిక యూనిట్‌లోకి కొందరు దుండగులు మాస్క్‌లు ధరించి చొరబడ్డారు. మెయిన్ గేట్‌ను బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన వారు.. క్షణాల వ్యవధిలో అక్కడ నిలిపి ఉంచిన ఐదు లగ్జరీ కార్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. దొంగల్లో ఒకడు గేట్ తెరిచి పట్టుకోగా.. మిగతా వారు కార్లను బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడు కూడా కారెక్కి వారితో పాటే పారిపోయాడు. ఇదంతా కేవలం 60 సెకన్లలో జరిగిపోయింది. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
చోరీకి గురైన వాటిల్లో అరుదైన ఏరియల్ ఆటమ్ రేసింగ్ కార్, మెర్సిడెస్ బెంజ్ ఏ45 ఏఎంజీ 4మ్యాటిక్, పోర్షె కెయెన్నె, పోర్షే 911 కెరేరా, మెర్సిడెస్ మేబాష్ కార్లు ఉన్నట్లు ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. వీటి విలువ 7లక్షల పౌండ్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7కోట్లకు పైనే ఉంటుంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ఓ మెర్సిడెస్ కారును గుర్తించారు. మిగతా కార్లు, దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.